పాన్ ఇండియా కలలు చెల్లాచెదురు

పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి హీరోకు ఉంటుంది. తను చేసే ప్రతి సినిమాను అదే కోణంలో చూస్తాడు కూడా. అదృష్టంకొద్దీ కొంతమందికి ఆ గుర్తింపు ఈజీగా దక్కుతుంది. మరికొంతమంది మాత్రం ఇంకొన్నాళ్లు…

పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి హీరోకు ఉంటుంది. తను చేసే ప్రతి సినిమాను అదే కోణంలో చూస్తాడు కూడా. అదృష్టంకొద్దీ కొంతమందికి ఆ గుర్తింపు ఈజీగా దక్కుతుంది. మరికొంతమంది మాత్రం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుంది. వరుణ్ తేజ్ రెండో రకం. 

ఆపరేషన్ వాలంటైన్ తో బాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయమవ్వాలనుకున్న ఈ మెగా హీరో కలలు ఫలించలేదు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ముంబయిలో తిష్టవేసి మరీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కొన్ని హిందీ ఛానెల్స్ లో కూడా కనిపించాడు. అతడు చేసిన భారీ ప్రచారం, సినిమాకు ఏమాత్రం కలిసిరాలేదు.

బాధాకరమైన విషయం ఏంటంటే.. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా క్లిక్ అవ్వలేదు. వీకెండ్ లో ఓ మోస్తరుగా నడిచిన ఈ సినిమా, ఈరోజు నుంచి పూర్తిస్థాయిలో చతికిలపడింది. ఆన్ లైన్ బుకింగ్స్ తో పాటు టికెట్ కౌంటర్ సేల్స్ కూడా దారుణంగా పడిపోయాయి. ఫలితంగా కెరీర్ లో మరో డిజాస్టర్ అందుకున్నాడు వరుణ్ తేజ్.

దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. మేకోవర్ నుంచి యాక్టింగ్ వరకు ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా కోసం తన పెళ్లిని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు ఈ హీరో. ఇంత చేసినప్పటికీ వరుణ్ తేజ్ ఆశించిన ఫలితం దక్కలేదు. 

శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమయ్యాడు వరుణ్ తేజ్. ఇదే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ మానుషి చిల్లర్. వీళ్లిద్దరికీ ఇది సరైన బ్రేక్ ఇవ్వలేదు.