వెంకీమామ రిలీజ్ అవుతోందనే ఆనందం వెంకీ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎప్పుడూ పెద్దమనిషి తరహాలో, కాస్త హుందాగా ఉండే వెంకటేష్, దాదాపు 3-4 రోజులుగా ఫుల్ జోష్ తో కనిపిస్తున్నాడు. మొన్నటికిమొన్న ప్రెస్ మీట్ సందర్భంగా ఏకంగా అన్నయ్య సురేష్ బాబుపైనే సెటైర్లు వేసిన వెంకటేష్, ఈసారి మీడియాపై ఛలోక్తులు విసిరాడు.
ఈరోజు యూనిట్ అంతా కలిసి ఖమ్మం బయల్దేరింది. అక్కడే ప్రీ-రిలీజ్ ఈవెంట్. పనిలోపనిగా ప్రేక్షకుల మధ్య ట్రయిలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టుడియోస్ నుంచి యూనిట్ అంతా బస్సులో బయల్దేరింది. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియాతో చాలా సరదాగా మాట్లాడాడు వెంకీ.
సీరియస్ గా ఉన్న మీడియా ప్రతినిధుల వైపు తిరిగి నవ్వమని కోరాడు. మీరు నవ్వుతూ ఫొటోలు తీస్తేనే సినిమా హిట్ అవుతుందంటూ జోకులేశాడు. అక్కడితో ఆగలేదు, వరుసగా యూనిట్ లో ఒక్కొక్కర్ని తనే పిలిచి మీడియాతో మాట్లాడించాడు. ఆ తర్వాత తనే స్వయంగా పటాసులు కాల్చి, జెండా ఊపి బస్సు టూర్ ప్రారంభించాడు.
కేవలం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కే బస్సు టూర్ పరిమితం కాదంటున్నాడు వెంకీ. ఈ ఫంక్షన్ తో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర.. రిలీజ్ తర్వాత కూడా కొనసాగుతుందని, సక్సెస్ మీట్ తో ముగుస్తుందని తెలిపాడు. పాప..పాప అంటూ పాయల్ రాజ్ పుత్ ను వెంకీ ఆటపట్టించడం కొసమెరుపు.