నెల్లూరు ముసలం ముదిరింది. అనుకున్నట్టే పంచాయితీ సీఎం జగన్ వద్దకు చేరింది. అయితే జగన్ మాత్రం కనీసం వివరణ కూడా అడక్కుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా జాగ్రత్త అంటూ విజయసాయిరెడ్డి ద్వారా ఆనం రామనారాయణ రెడ్డికి హెచ్చరికలు పంపించారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు వైసీపీలో చేరిన సందర్భంగా నెల్లూరు నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో మాఫియాలంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన వద్ద ప్రస్తావనకు వచ్చాయి.
ఈ విషయంపై అప్పటికే ఆగ్రహంతో ఉన్న జగన్.. విజయసాయిరెడ్డితో కూడా ఒకింత కోపంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి విజయసాయిరెడ్డి ద్వారానే వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లాతో విజయసాయికి మంచి సంబంధాలు ఉండటంతో ఆయనతోనే ఆనం మంతనాలు సాగించేవారు. చూచాయగా ఆనం అసంతృప్తిని కూడా విజయసాయిరెడ్డి సీఎం జగన్ వద్దకు పలుమార్లు తీసుకెళ్లారు. అయితే జగన్ ఆ విషయానికి అంతగా ప్రాధాన్యమివ్వలేదట.
మంత్రి పదవి దక్కలేదన్న ఉక్రోషం ఓవైపు, తనకంటే చిన్నవారికి మంత్రి పదవి వచ్చిందన్న కడుపు మంట మరోవైపు, తన మూలాలు కదులుస్తున్నారన్న అనుమానం మరోవైపు.. వెరసి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో మాఫియాలంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఆనం మాట్లాడిన వీడియో ఫుటేజీ రాత్రే జగన్ కు చేరింది. ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారట. ఇష్టముంటే ఉండమనండి, లేదంటే లేదు అని విజయసాయిరెడ్డి దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారట జగన్. మరీ శృతి మించితే పార్టీనుంచి సస్పెండ్ చేస్తాననే మాట కూడా వాడారని సమాచారం.
దీంతో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆనం విషయంపై వివరణ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సహించబోమని ఆయన హెచ్చరించారు. జగన్ చెప్పకపోతే విజయసాయి ఈ స్టేట్ మెంట్ ఇవ్వరు కదా. అంతకు ముందు మంత్రి అనిల్ మాట్లాడినా.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి ఆనం వ్యాఖ్యానించి ఉంటారని చెప్పి తెలివిగా తప్పించుకున్నారు. పార్టీ గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ జగన్ ఎవరిపైనా ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయలేదట.
కొన్నిరోజుల క్రితం రఘురామ కృష్ణంరాజు కి క్లాస్ తీసుకున్న జగన్, అంతకంటే ఎక్కువగా ఆనం విషయంలో కోపంగా ఉన్నారట. ఇంతకీ ఆనం వ్యవహారం ఇంతటితో ఆగుతుందా లేక, మరో మలుపు తిరుగుతుందా అనేది వేచి చూడాలి.