దిశ నిందితుల ఎన్కౌంటర్పై దేశంలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఎన్కౌంటర్ను సమర్థించే వాళ్లు, విమర్శించే వాళ్లు రెండు పక్షాలుగా విడిపోయి తమతమ వాదనలను గట్టిగా వినిపిస్తున్నారు. అయితే యాసిడ్ బాధితురాలు టి.ప్రణీత అభిప్రాయం చాలా ఆసక్తిని కలిగిస్తోంది. ఎందుకంటే ప్రణీతతో పాటు ఆమె స్నేహితురాలు స్వప్నికపై కూడా 2008లో దుండగులు యాసిడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన స్వప్నిక చికిత్స పొందుతూ 20 రోజులకు చనిపోయింది.
ప్రణీత మాత్రం చాలా కాలానికి కోలుకొంది. సాప్ట్వేర్ ఉద్యోగిగా ఆమె అమెరికాలో స్థిరపడింది. వీరిపై యాసిడ్ దాడి చేసిన వారిని 2008లో ఎన్కౌంటర్ చేశారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆమె అభిప్రాయాలు చాలా విలువైనవిగా భావించాలి.
యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్తో మీకు న్యాయం జరిగిందని భావిస్తున్నారా అనే ప్రశ్నకు…న్యాయం జరగలేదని కుండబద్దలు కొట్టినట్టు ఆమె చెప్పింది. నా ముఖం, చర్మం సాధారణ స్థితికి వచ్చినప్పుడు, నేను మామూలు జీవితం గడిపినప్పుడు మాత్రమే తనకు న్యాయం జరిగినట్టు భావిస్తానని చాలా పరిణతితో కూడిన సమాధానం ఇచ్చిందామె.
ఎన్కౌంటర్ మరణాలు మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయా అనే ప్రశ్నకు “నన్ను అడగొద్దు. ఎన్కౌంటర్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆ మాట వింటే నాకు భయమేస్తుంది” అని ఆమె చెప్పింది.
మహిళలపై అత్యాచారాలకు, దాడులకు పాల్పడిన వారిపై సామూహిక హింస కాకుండా …చట్టపరంగా వారిని కఠినంగా శిక్షించడమే పరిష్కారమని వరంగల్ యాసిడ్ బాదితురాలు టి.ప్రణీత తేల్చి చెప్పింది.