నెల్లూరు జిల్లా టీడీపీలో బలమైన బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు విజయవాడలో శనివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా మస్తాన్‌రావు మాట్లాడుతూ ఆరునెలల్లోనే 80 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన సీఎం జగన్ పాలన నచ్చి పార్టీలో చేరినట్టు తెలిపాడు.
శుక్రవారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపాడు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు ఆయన వెంట ఉన్నారు.
బీదా మస్తాన్‌రావు రాజకీయ నేపథ్యం
బీదా మస్తాన్‌రావు, బీదా రవిచంద్ర వరుసకు అన్నదమ్ముళ్లు. బీదా రవిచంద్ర ప్రస్తుతం టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.బీదా మస్తాన్‌రావు ప్రముఖ వ్యాపారి. ఆయనకు రొయ్యల మేత తయారీ, రొయ్యల సాగుకు అవసరమైన అన్ని వస్తువులను తయారు చేసే పరిశ్రమలున్నాయి.
2004లో అల్లూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి కె.విష్ణువర్ధన్‌రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఆ నియోజకవర్గం రద్దైంది. దీంతో ఆయన కావలి నుంచి రాజకీయాలు ప్రారంభించాడు.
2009లో కావలి నుంచి ఆయన విష్ణువర్ధన్‌రెడ్డిపై పోటీ చేసి గెలుపొందాడు. ఆ తర్వాత 2014లో ఓడిపోయాడు. 2019లో చివరి నిమిషంలో పార్టీ ఫిరాయించిన విష్ణువర్ధన్‌రెడ్డికి టీడీపీ టికెట్ దక్కింది. దీంతో బీదా మస్తాన్‌రావు మనస్థాపం చెందాడు.
ఆయనకు నెల్లూరు పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. అయితే అయిష్టంగానే ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. టీడీపీ అధిష్టానం తన పట్ల వ్యవహరించిన వైఖరితో కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు.
బీదాకు కావలి నియోజకవర్గంలో అణగారిన వర్గాల్లో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా తన సామాజికవర్గమైన యాదవుల్లో ఆయనకు తిరుగులేని పట్టు ఉంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వంతో ఆయన వైసీపీలో చేరాడు. రాజ్యసభ పదవి హామీతో వైసీపీలో చేరనున్నట్టు బీదా వర్గీయులు చెబుతున్నారు. వ్యాపార సంస్థలపై దాడులకు భయపడి పార్టీ మారాడని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అంతేకాకుండా దగదర్తి, అల్లూరు మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని బీదా సోదరులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో మస్తాన్‌రావు వైసీపీలో చేరడం నెల్లూరు జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసింది.