ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరి చేతిలోకి వెళ్లడం ఇండస్ట్రీలో సర్వసాధారణం. మొన్నటికిమొన్న రాజశేఖర్ తో ఓ రీమేక్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసి, ఆ తర్వాత అదే ప్రాజెక్టును సుమంత్ తో సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి సినిమానే. ఈసారి వెంకటేష్ చేయాల్సిన సినిమా రవితేజ చేతికొచ్చింది.
వెంకీ కోసం రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఓ కథ సిద్ధంచేశాడు. దీనికోసం గోవాలో నెల రోజుల పాటు తిష్టవేసి మరీ కథ, డైలాగ్స్ పూర్తిచేశాడు. కట్ చేస్తే ఈ కథ వెంకీకి నచ్చలేదు. అందుకే దాన్ని పక్కనపెట్టాడు. ఇదే కాదు, తరుణ్ భాస్కర్ చెప్పిన స్టోరీలైన్ కూడా నచ్చలేదు. వీటి స్థానంలో అసురన్ అనే రీమేక్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
వెంకీ రిజెక్ట్ చేయడంతో ఈ కథ తీసుకొని నేరుగా రవితేజను కలిశాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. వెంకీకి నచ్చని ఈ కథ, రవితేజకు నచ్చింది. కాకపోతే రవితేజ కూడా తనదైన స్టయిల్ లో కొన్ని మార్పులు చెప్పాడు. దీంతో ప్రస్తుతం ప్రసన్నకుమార్ ఆ పనిలో పడ్డాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ నెలలోనే ఓ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే రవితేజ-త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో సినిమా ఉంటుంది.