మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగా నిరాదరణకు గురి అయిన సీనియర్ నేత నితిన్ గడ్కరీ. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి జాతీయాధ్యక్షుడిగా వ్యవహరించిన నేపథ్యం ఉంది గడ్కరీకి. అలాంటి వ్యక్తిని ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో పూచికపుల్లలా తీసేశారు. ప్రత్యేకించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు గడ్కరీ అంటే ఏ మాత్రం పడదని ఒక టాక్ నడుస్తూ ఉంది. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులను స్వయంగా కలిగి ఉండటంతో పాటు, మోడీ-షాలకు విశ్వాస పాత్రుడు అయిన ఫడ్నవీస్ మొత్తం తన కనుసన్నల్లో నడిపించారంటారు.
ఒకప్పుడు జాతీయాధ్యక్షుడిగా వ్యవహరించిన, ప్రస్తుత కేంద్ర మంత్రి అయిన గడ్కరీ పాత్రను చాలా చాలా పరిమితం చేసిన వైనం అయితే మీడియాలో చర్చనీయాంశంగా నిలిచింది. అయితే చివరకు మాత్రం గడ్కరీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పుతున్నట్టుగా లేదు. ఎన్నికల సమయంలో ఆయనను బీజేపీ పక్కన పెట్టినా, ఇప్పుడు మాత్రం ఆయన జోక్యం తప్పనట్టుగా ఉంది.
శివసేన-బీజేపీల మధ్య ప్రభుత్వ ఏర్పాటు పై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో .. ఇరు వర్గాలకూ రాజీ కుదిర్చే బాధ్యతను గడ్కరీ తీసుకోనున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. బీజేపీ బెట్టు చేస్తోందంటూ శివసేన వాళ్లు ఆర్ఎస్ఎస్ కు ఫిర్యాదు చేశారట.
వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాలని ఆర్ఎస్ఎస్ కమలం పార్టీలోని ముఖ్యులకు ఆదేశాలు ఇస్తోందని, ఈ నేపథ్యంలో గడ్కరీ రంగంలోకి దిగి ఇరు వర్గాలకూ రాజీ ఫార్ములాను తయారు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతూ ఉంది. మొత్తానికి గడ్కరీని బీజేపీ నేతలు ఎంత పక్కన పెట్టినా, చివరకు ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఆయన జోక్యం అవసరం అవుతుండటం గమనార్హం!