సాధారణంగా అర్థరాత్రి పదాన్ని ఉత్కంఠకు సంకేతంగా వాడుతుంటారు. అర్థరాత్రి అనేవరకల్లా ఒకవిధమైన భయం కలిగించే భావన కలుగుతుంది. అర్థరాత్రి పదాన్ని ఉపయోగించి కొన్ని సినిమాలు, డిటెక్టివ్ నవలలూ వచ్చాయి. మొత్తం మీద అర్థరాత్రి అనేది ఉత్కంఠ, సస్పెన్స్ కలిగిస్తాయి.
ఈరోజు అర్థరాత్రి కూడా యమ ఉత్కంఠను, సస్సెన్సును కలిగించేదే. అదే…ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధించిన గడువు.
'ఐదో తేదీ అర్థరాత్రి వరకు ఆర్‌టీసీ కార్మికులు డ్యూటీల్లో చేరాలి. అదే డెడ్‌లైన్. ఆ సమయంలోగా చేరినవారే ఆర్‌టీసీ కార్మికులు. మిగతా వారు ఉద్యోగాలు కోల్పోయినట్లే. వారిని ఆర్‌టీసీ కార్మికులుగా పరిగణించడం. అర్థరాత్రి తరువాత డ్యూటీల్లో చేరతామంటే ఒప్పుకోం. ఇప్పటికే 5,100 రూట్లు ప్రైవేటు రంగానికి ఇవ్వాలని నిర్ణయించాం. కార్మికలెవరూ విధుల్లో చేరకపోతే మిగిలి రూట్లు కూడా ప్రైవేటుపరం చేస్తాం. ఇక రాష్ట్రంలో ఆర్‌టీసీ అనేది ఉండదు'…అని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు.
ఉద్యోగాల్లో చేరాలో వద్దో కార్మికులే నిర్ణయించుకోవాలని సీఎం అన్నారు. అందుకే ఈరోజు అర్థరాత్రి వరకల్లా ఎంతమంది కార్మికలు విధుల్లో చేరతారనేదాన్నిబట్టి ఆర్‌టీసీ భవిష్యత్తు, కార్మికుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు, టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. అవసరమైతే ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళుతుందని కూడా కేసీఆర్ చెప్పారు.
కేసీఆర్ కఠిన ప్రకటనల తరువాత కూడా ఆర్‌టీసీ జేఏసీ ఏమీ తేల్చుకోలేదు. కాని డిమాండ్లపై ఇదివరకు ఉన్న పట్టుదల కాస్త సడలినట్లు కనబడుతోంది. ప్రభుత్వంలో ఆర్‌టీసీ విలీనం డిమాండ్‌ను కూడా పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నారు. మరికొన్ని డిమాండ్లపై కూడా రాజీపడే ధోరణిలో ఆర్‌టీసీ కార్మికులున్నారు. ఈరోజు అర్థరాత్రి వరకు సమయం ఉంది కాబట్టి సమ్మెను ముగించాలనే నిర్ణయం తీసుకుంటే అందుకు అవకాశముంది.
ప్రభుత్వం తమను చర్చలకు పిలిస్తే అక్కడ జరిగేదాన్నిబట్టి సమ్మె ముగించడమో, కొనసాగించడమో నిర్ణయించుకుంటామని ఆర్‌టీసీ జేఏసీ నాయకులు చెబుతున్నారు. కాని చర్చలకు కేసీఆర్ అవకాశం ఇవ్వరు. ఈ కఠిన వైఖరిని సడలించే ఉద్దేశం ఆయనకు లేదు. ఆర్‌టీసీ కార్మికుల సమ్మెలో ప్రతిపక్షాలు యాక్టివ్‌గా ఉన్నాయి. కార్మికులు కూడా ప్రతిపక్షాల మద్దతుతోనే ముందుకు పోతున్నారు. తాను ఆర్‌టీసీ కార్మికుల పట్ల కొద్దిగానైనా సానుకూలంగా ఉండి, కొన్ని డిమాండ్లనైనా పరిష్కరించడానికి ఒప్పుకుంటే ఇదంతా తమ విజయమేనని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటాయి. ముఖ్యంగా బీజేపీ చెలరేగిపోతుంది. దీన్ని కేసీఆర్ సహించలేరు. 'ధిక్కారమును సైతునా' అనే తత్వం ఆయనది.
సమ్మె పట్ల కేసీఆర్ ఇంత కఠినంగా ఉండటానికి మరో కారణాన్ని చెప్పుకోవచ్చు. సమ్మె ఉధృతంగా జరుగుతుండగానే హుజూర్‌నగర్ ఉప ఎన్నిక జరిగింది. అది ముగిసేవరకు కేసీఆర్ సమ్మెపై బహిరంగంగా (మీడియా సమావేశం పెట్టి) మాట్లాడలేదు. ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి నిర్ణయించుకోవాలనుకున్నారు. ఉప ఎన్నికలో సూపర్‌డూపర్ మెజారిటీతో టీఆర్‌ఎస్ గెలిచింది. ఇది ఆయన కూడా ఊహించనంతటి విజయం. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని విర్రవీగిన ప్రతిపక్షాలు సోదిలోకి లేకుండాపోయాయి. ఆర్‌టీసీ సమ్మె ప్రభావం బైపోల్ మీద పడుతుందనుకున్న విపక్షాల ఆశలు అడియాసలయ్యాయి. ఒకవేళ టీఆర్‌ఎస్ గెలిచినా చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా ఉంటుందని అనుకున్నాయి. కాని అంతా రివర్సయింది.
ఉప ఎన్నిక విజయం తరువాతే కేసీఆర్ ఆర్‌టీసీపై తన కఠిన వైఖరిని మరింత బలంగా చెప్పారు. ప్రతిపక్షాలకు ప్రజల మద్దతు లేదనే విషయం స్పష్టమైందని కేసీఆర్ భావించారు. ఏపీలో ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలయ్యాకనే అది చూసి ఇక్కడి కార్మికులు రెచ్చపోతున్నారని భావించిన కేసీఆర్ తన మిత్రుడు కమ్ శిష్యుడు జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
'ఏపీలో ఏమైతది? మన్ను మశానం కాదు' అని విలీనంపై వ్యాఖ్యానించారు. ఆర్‌టీసీ విలీనంపై జగన్‌కు ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. టీఎస్‌ఆర్‌టీసీ ఎప్పటికీ విలీనమయ్యే ప్రసక్తే లేదని తేల్చిపారేశారు.
కసీఆర్ డెడ్‌లైన్ విధించిన తరువాత ఇప్పటివరకు ఎంతమంది కార్మికులు విధుల్లో చేరారనే దానిపై సరైన లెక్క లేదు. ప్రభుత్వ వర్గాలు ఒక సంఖ్య చెబుతుంటే, ఆర్‌టీసీ జేఏసీ మరో రకంగా చెప్పింది. ఆర్‌టీసీ మాజీ ఉన్నతాధికారులు, రవాణరంగ నిపుణులు ఆర్‌టీసీపై రకరకాలుగా భాష్యాలు చెబుతున్నారు. మొత్తం మీద టీఎస్‌ఆర్‌టీసీ పరిష్కరించలేని పజిల్‌గా మారింది.
ఈ సంస్థ మనుగడ ఏవిధంగా ఉంటుందనేది ఈరోజు అర్థరాత్రితో తేలిపోతుంది. 49 వేల మంది కార్మికుల పొట్టలు కొట్టే ఉద్దేశం లేదని చెప్పిన ముఖ్యమంత్రి ఈ కథను ఎలా ముగిస్తారనేది ఎవ్వరికీ తెలియదు.