సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే సరిపోదు.. సరైన బ్రేక్ అవసరం. 'ప్రేమించుకుందాం రా' సినిమాకు ముందు కూడా జయప్రకాష్ రెడ్డి పలు సినిమాల్లో నటించాడంటే కొంతమంది ఆశ్చర్యపోతారు. అంతకు ముందు కూడా పలు సినిమాలో ఆయన నెగిటివ్ టచ్ తో కూడిన పాత్రల్లో కనిపించారు. 'చిత్రం భళారే విచిత్రం' 'జంబలకడిపంబ' వంటి సినిమాల్లో జయప్రకాష్ రెడ్డి చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తారు. అయితే అలా ఎన్ని చేసినా.. ఆయన కెరీర్ ను మార్చేసిన సినిమా మాత్రం 'ప్రేమించుకుందాం రా'. అప్పటికే సినిమా ప్రయత్నాలు చేసి, చిన్న చిన్న పాత్రలతో తగిన గుర్తింపు రాక విసిగిపోయి ఆయన ఇంటిదారి పట్టారట. ఒక ఇంటర్వ్యూలో ఆయనే ఆ విషయాన్ని చెప్పారు. అనూహ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ నుంచి పిలుపు రావడంతో తన కెరీర్ మలుపుతిరిగిందని జేపీ వివరించారు.
వాస్తవానికి ఆ పాత్రకు నానా పటేకర్ ను కూడా అనుకున్నారట. ఆ బాలీవుడ్ నటుడిని తీసుకురావడం ఆ నిర్మాణ సంస్థకు పెద్ద విషయం కాదు. అయితే అన్ని విధాలుగానూ జయప్రకాష్ రెడ్డి ఆ పాత్రకు సూటవ్వడంతో అవకాశం ఆయనకే దక్కింది. ఆ సినిమా చిత్రీకరణ కూడా కొంత వరకూ అనంతపురం జిల్లాలో చేశారు. ఆ పాత్ర కోసం ఆయన రాయలసీమ మాండలికాన్ని ఒడిసిపట్టుకున్నారు. అప్పటికే తన జీవితం కొంత కాలం సీమలో గడిచిందని, ఆ పాత్ర కోసం సీమ పల్లెల్లో తిరిగి ఆ మాండలికాన్ని అలవాటు చేసుకున్నట్టుగా జేపీ వివరించారు.
ఆ సినిమాతో వచ్చిన బ్రేక్ తో ఆయన తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఫ్యాక్షన్ సినిమాలకు తప్పనిసరి విలన్ గా ఆయనను అవకాశాలు వరించాయి. ఫ్యాక్షన్ సినిమాలో జేపీలోని ఒక కోణాన్ని పరిచయం చేస్తే.. శ్రీనువైట్ల, వినాయక్ సినిమాలు ఆయనలోని హాస్య నటుడిని మరోసారి హైలెట్ చేశాయి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా 'ఢీ' సినిమాలో జేపీ పాత్ర అలా గుర్తుండిపోతుంది. 'కృష్ణ' సినిమాలో చేసిన పాత్ర తర్వాత జేపీ ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలు బోలెడన్ని చేశారు.
సాధారణ సీన్ ను కూడా మాటల విరుపుతో, ఎక్స్ ప్రెషన్స్ తో జయప్రకాష్ రెడ్డి పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. అటు పెద్ద హీరోల సినిమాల్లో చేస్తూనే చిన్న సినిమాల్లో కామెడీ సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులను అనునిత్యం ఎంటర్ టైన్ చేశారాయన. గత 20 యేళ్ల నుంచి జేపీ నటుడిగా వెనుకబడిన సందర్భాలు దాదాపు లేవు. నటుల జీవితాల్లో కూడా కాస్త ఎత్తుపల్లాలుంటాయి. అయితే జేపీ కెరీర్ మాత్రం స్టడీగా సాగింది.
తెలుగుతో పాటు పక్క భాషల ఇండస్ట్రీలో కూడా జేపీ కి ప్రత్యేక గుర్తింపు లభించడం ఆసక్తిదాయకమైన విషయం. తమిళంలో పలు సినిమాల్లో నటించారు. 'ఆరు' సినిమాలో చెన్నైలోని తెలుగు విలన్ పాత్రలో జేపీ తెలుగులోనే మాట్లాడతారు. ఇక ఉత్తరాది మీమ్స్ పేజ్ వాళ్లు కూడా జేపీ ఫొటోను వాడుకుంటూ ఉంటారు! తెలుగు నుంచి హిందీలోకి అనువాదం అయిన యాక్షన్ సినిమాలతో జేపీకి అక్కడ గుర్తింపు దక్కింది. సౌత్ సినిమాల్లో హోం మినిస్టర్ పాత్రలో కనిపించే నటుడు అంటూ మీమ్స్ పేజ్ వాళ్లు జయప్రకాష్ రెడ్డి ఫొటోను తమాషాలాడుతుంటారు.
అన్నింటికీ మించి సినిమా నటుడిగా తనెంత బిజీగా ఉన్నా.. ఖాళీ సమయాల్లో ఆయన నాటకాన్ని వదల్లేదు. తను, తన స్నేహితుడొకరు రాసుకున్న 'అలెగ్జాండర్' నాటకాన్ని చిన్న చిన్న పట్టణాలకు వెళ్లి సైతం ప్రదర్శిస్తూ వచ్చారు. అది ఏకపాత్రాభినయం. దాన్ని సినిమాగా తెరకెక్కించాలనేది తన చిరకాల ఆకాంక్ష అని జేపీ చెబుతూ వచ్చారు. ఈ మధ్యనే దాన్ని సినిమాగా తీశారని తెలుస్తోంది. చివరగా జేపీ అలరించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' 'కూజా చెంబైంది..' అంటూ గుర్తుండిపోయే పాత్రలో కనిపించారు. 74 యేళ్ల వయసులో హఠాన్మరణం పాలయ్యారు. తన నటనతో మాత్రం గుర్తుండి పోతారు.