చిత్రసీమలో బంధాలు, బంధుత్వాలు కూడా అవసరార్థం ఏర్పడుతూ ఉండవచ్చు. ఇండస్ట్రీని ప్రభావితం చేయగల వ్యక్తుల పేర్లను అడ్డం పెట్టుకుని వారితో బీరకాయ పీచు బంధుత్వం ఉన్న వాళ్లు కూడా కొందరు తెరపైకి వస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలు తమకు బాగా కావాల్సిన వారిని, కొడుకులను, మేనల్లుళ్లను ప్రోత్సహించే వైనం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఒక ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చి, అక్కడ సెటిలయ్యే హీరోయిన్లు కూడా తమ వారిని లాక్కురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
చాలా మంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను తెరకు పరిచయం చేశారు. అలాగే మరి కొందరు హీరోయిన్లు తమ సోదరులను హీరోలుగా పరిచయం చేసే ప్రయత్నాలూ సాగించారు. అయితే తమ బంధుగణాన్ని, ఆఖరికి కూతుళ్లను అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసిన హీరోయిన్లు పరిమితమే!
ఇండస్ట్రీపై హీరోయిన్లు ఈ తరహాలో పట్టు సాధించలేకపోతూ ఉంటారు. అందుకే దూరం బంధువులను, కజిన్స్ ను ఈ హీరోయిన్లు అస్సలు పట్టించుకున్నట్టుగా కనిపించరు. నటి విద్యాబాలన్ ది, మరో నటి ప్రియమణిది ఇదే తరహా బంధుత్వం లాగే ఉంది. ప్రియమణి తన దగ్గరి బంధువే అని విద్యాబాలన్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. గతంలో ఇందుకు సంబంధించి ప్రచారం అయితే ఉంది. వీరిద్దరూ బంధువులనే విషయం గురించి మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈ అంశాన్ని విద్యాబాలన్ ధ్రువీకరించింది. అయితే తాము బంధువులే కానీ… ఎప్పుడూ కలిసింది లేదని విద్యా చెబుతోంది. ప్రియమణి మంచి నటి అని విద్య కితాబిచ్చింది. తామిద్దరం బంధువులే అయినా ఇప్పటి వరకూ జీవితంలో కలిసి ఒక్కసారే అని విద్య చెప్పింది. అది కూడా ఒక అవార్డు ఫంక్షన్లోనట. కుటుంబ కార్యక్రమాల్లో కానీ, మరో చోట కానీ తామిద్దరం ఎప్పుడూ కలవలేదని, బంధుత్వం మాత్రం ఉందని విద్యాబాలన్ తమ గురించి చెప్పుకొచ్చింది. బంధువులు అయిన ఈ హీరోయిన్లిద్దరూ జాతీయ అవార్డు గ్రహీతలు కావడం మరో విశేషం.