ఒకవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా.. కరోనా కారణ మరణాల నంబర్ మాత్రం తీవ్ర స్థాయిలోనే నమోదవుతూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో దాదాపు 70 వేల రోజువారీ కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3,921గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
రోజు వారీ కేసుల లక్ష లోపుకు తగ్గి వారం అయినా ఇలా భారీ స్థాయిలో కరోనా కారణ మరణాల సంఖ్య నమోదు కావడం ఆందోళనకరమైన అంశం. మరీ దీని వెనుక కారణం ఏమిటి.. అంటే, కొన్ని రాష్ట్రాలో బ్యాక్ లాగ్ మరణాల సంఖ్యను వెల్లడించడంతోనే ఇలా మరణాల నంబర్ భారీగా నమోదవుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
ఉదాహరణకు గత వారంలో బిహార్ ఇదే తరహాలో భారీ సంఖ్యను వెల్లడించింది. అంత వరకూ కరోనా కారణ మరణాలుగా నిర్ధారించని వాటిని బిహార్ కోర్టు ఆదేశాల మేరకు కరోనా కారణ మరణాలుగా పరిగణించాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఒకే రోజు వేల సంఖ్యలో కౌంట్ పెరిగింది. ఇక మహారాష్ట్రలో కూడా ఇదే జరుగుతున్నట్టుగా ఉంది. గత 24 గంటలకు సంబంధించిన నంబర్లలో దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3,921 అని కేంద్రం పేర్కొనగా, ఇందులో మహారాష్ట్ర వాటా ఏకంగా 2,771 గా ఉంది!
గత వారం రోజుల్లో కూడా ఈ కేటగిరిలో మహారాష్ట్ర నంబర్లు ఎక్కువగానే ఉంటున్నాయి. ఇవన్నీ పాత లెక్కల సవరణలు అని అర్థం అవుతోంది. కరోనా పీక్ స్టేజిలో ఉన్నప్పుడు ఈ ఖాతాలో పరిగణించని కొన్ని కేసులను ఇప్పుడు కలుపుతున్నారని.. దీంతో ఈ నంబర్ సంఖ్య రోజువారీ పెరిగినట్టుగా కనిపిస్తోందని తెలుస్తోంది. బ్యాక్ లాగ్ నంబర్లను యాడ్ చేస్తూ ఉండటంతో ఇప్పుడు కేసులు తక్కువైనా, మరణాల నిష్పత్తి పెరిగినట్టుగా అనిపిస్తున్నట్టుగా ఉంది.
కరోనా కారణంగా లక్షకు పైగా మరణాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక 32 వేల మరణాలతో రెండో స్థానంలో ఉంది. తమిళనాడు 29 వేల సంఖ్యతో మూడో స్థానంలో, 24 వేల స్థాయి సంఖ్యతో ఢిల్లీ నాలుగో స్థానంలో, 21 వేల స్థాయి మరణాలతో యూపీ ఐదో స్థానంలో ఉంది. వెస్ట్ బెంగాల్, పంజాబ్, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.
భారీ సంఖ్యలో పరీక్షలు చేసి, ఎక్కువ కరోనా కేసులను నిర్ధారించినా.. తక్కువ మరణాలు నమోదు అయిన రాష్ట్రాలుగా కేరళ, ఆంధ్రప్రదేశ్ లున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ పరీక్షలు చేశారు, ఎక్కువ కేసులూ నమోదయ్యాయి. అయితే కరోనా కారణ మరణాల సంఖ్యలో మాత్రం పరిమిత స్థాయిలో నిలిచాయి ఈ రెండు దక్షిణాది రాష్ట్రాలూ. తమిళనాడు కూడా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసింది కానీ, మరణాలను పూర్తిగా నియంత్రించలేకపోయింది.