మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ, ప్రస్తుతం అప్పులతో నడుస్తోంది. మరోవైపు కరోనా కల్లోలం ఉండనే ఉంది. కరోనా నివారణ చర్యలతో పాటు, సంక్షేమ పథకాల అమలుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఓవైపు 40వేల కోట్ల రూపాయల అప్పులు ఉంటుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం 32 లగ్జరీ కార్లు కొనుగోలు చేసింది.
కియా కంపెనీకి చెందిన హై-ఎండ్ మోడల్ కియా-కార్నివాల్ కార్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్కో కారు ధర 25 లక్షల నుంచి 30 లక్షల మధ్య ఉంటుంది. ప్రగతి భవన్ లో స్వయంగా రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్లను ప్రారంభించారు. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది అదనపు జిల్లా కలెక్టర్లకు ఈ కార్లను అందజేసింది కేసీఆర్ సర్కారు.
ఈ వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న టైమ్ లో కోట్ల రూపాయలు పెట్టి ఇలా లగ్జరీ కార్లు కొనడాన్ని తప్పుపట్టింది. కేవలం అధికారుల్ని ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఉద్దేశపూర్వకంగా చేసిన కుతంత్రం ఇదని ఆరోపించింది.
ఓవైపు ప్రజలు కరోనాతో చనిపోతుంటే, రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. 11 కోట్ల రూపాయలు పెట్టి 32 ఖరీదైన లగ్జరీ కార్లు కొనడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ఖండించారు. కరోనా కల్లోలంలో ప్రజాధనాన్ని ఇలా వృధాచేయడాన్ని భయానక నిర్ణయంగా చెప్పుకొచ్చారాయన.
అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ బెడ్లు పెంచడానికి లేక ప్రజా రవాణాకు ఉపయోగపడే బస్సుల కొనుగోలుకు ఆ డబ్బును వాడొచ్చని.. బ్రూరోక్రాట్ల మెప్పు కోసం లగ్జరీ కార్లు కొనడం తప్పన్నారు.
కరోనా/లాక్ డౌన్ వల్ల రాష్ట్రానికి 4500 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడిందని స్వయంగా మంత్రి హరీశ్ రావు చెప్పిన మాటల్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ గుర్తుచేస్తున్నారు. రెవెన్యూ లోటు ఉన్న టైమ్ లో ఉన్న వాహనాల్ని సద్వినియోగం చేసుకోకుండా, కొత్తగా లగ్జరీ కార్లు కొనడంపై ఆయన వివరణ కోరారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇలా అధికారులకు కార్లు కొనడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. 2015లో 10 జిల్లాలతో తెలంగాణ కొనసాగుతున్న టైమ్ లో జిల్లా కలెక్టర్లకు అత్యాధునిక టయోటా ఫార్చునర్స్ కొనిచ్చింది ప్రభుత్వం. ఆ తర్వాత తెలంగాణవ్యాప్తంగా ఉన్న పోలీసులకు కూడా కార్లు అందించింది.