ఆత్మహత్య చేసుకున్న హీరో కూతురు

హీరో విజయ్ ఆంటోనీ ఇంట విషాదం నెలకొంది. అతడి కూతురు మీరా ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది మీరా. చదువులో ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు…

హీరో విజయ్ ఆంటోనీ ఇంట విషాదం నెలకొంది. అతడి కూతురు మీరా ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది మీరా. చదువులో ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాధమికంగా తెలుస్తోంది. ఉదయం 3 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది 16 ఏళ్ల మీరా. కూతుర్ని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం దక్కలేదు.

చెన్నైలోని డీడీకే రోడ్ లో కుటుంబంతో కలిసి నివశిస్తున్నాడు విజయ్ ఆంటోనీ. కెరీర్ ప్రారంభంలో మ్యూజిక్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇతడు, ఆ తర్వాత సినిమాల్లో హీరోగా కూడా క్లిక్ అయ్యాడు. బిచ్చగాడు సినిమాతో దక్షిణాది మొత్తం పాపులర్ అయ్యాడు.

వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న విజయ్ ఆంటోనీ, తన భార్యను నిర్మాతగా మార్చాడు. ఆమె కూడా విజయ్ ఆంటోనీతో పాటు సినిమా రంగంలో రాణించడంతో పాటు, భర్తతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

ఇలా భార్యభర్తలిద్దరూ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. కూతుర్ని మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్లోకి తీసుకురాలేదు. అలా తండ్రి స్టార్ డమ్ కు దూరంగా పెరిగిన మీరా, కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతోంది. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ ఒత్తిడిలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి తేనాంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.