జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ప్రయోజనం కలిగించారు. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్‌పై రాజకీయంగా పెను భారాన్ని జగన్ ప్రభుత్వం దించినట్టైంది. బాబు అరెస్టే జరగకపోయి వుంటే టీడీపీతో పొత్తుపై పవన్ ఓ నిర్ణయానికి వచ్చేవారు కాదు. పవన్‌ను రాజకీయంగా ఊరిస్తూ టీడీపీ మైండ్ గేమ్ ఆడేది. అయితే బాబు అరెస్ట్‌తో టీడీపీ, వైసీపీలో ఎవరికి లాభం? ఎవరికి నష్టం అనేది తెలియరాలేదు. కానీ జనసేనాని మాత్రం లబ్ధి పొందారు.
జనసేన స్థాపించి పదేళ్లు దాటింది. ఇంత వరకూ ఆ పార్టీకి క్షేత్రస్థాయి నిర్మాణం లేదు. టీడీపీ పల్లకీ మోయడానికే జనసేన స్థాపించారనే ఆరోపణలు రోజురోజుకూ వెల్లువెత్తుతున్నాయి. 2019లో రాజకీయంగా చావుదెబ్బ తిన్న పవన్‌కల్యాణ్… ఆ తర్వాత కూడా పార్టీని పట్టించుకోలేదు. ఎంత సేపూ ఆయన ఇతర పార్టీల బలాన్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నట్టే కనిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఆ పార్టీతో కలిసి పని చేసిన దాఖలాలు లేవు.
బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే మరోసారి తాను కూడా గెలవలేనని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప తనకు రాజకీయ భవిష్యత్ లేదని నమ్మారు. క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేయడం విస్మరించి, పొత్తుల్ని నమ్ముకుని ఆయన ముందుకెళుతున్నారు. గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుందని ప్రకటించారు. గౌరవ ప్రదం అంటే ఎన్ని సీట్లో చెప్పలేదు.
ఈ నేపథ్యంలో జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్లపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 25 సీట్ల లోపే అనే ప్రచారం విస్తృతంగా సాగింది. ముందుగా పొత్తుపై అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని పవన్ ఆశించారు. పవన్ కోరికను సీఎం జగన్ నెరవేర్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. బాబుతో బేరానికి ఇదే సరైన సమయమని పవన్ భావించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పవన్ ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ టీడీపీతో పొత్తు వుంటుందని పవన్ ప్రకటించారు. అనంతరం ఆయన తన పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎప్పట్లాగే సీఎం జగన్‌పై అవాకులు చెవాకులు పేలారు.
అనంతరం ఆయన ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియడం లేదు. పొత్తు ప్రకటనతో పవన్‌కల్యాణ్ రాజకీయంగా రిలాక్ష్ అయ్యారనేది నిజం. పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ తదితర ముఖ్యులైన పదిమంది లోపు జనసేన నాయకులకు సీట్లు ఖరారైనట్టే. ఇక గెలుపోటముల సంగతి దేవుడెరుగు. ఎన్నికల ఖర్చు, మిగిలిన అంశాలు చంద్రబాబు చూసుకుంటారు. పొత్తు ప్రకటన మొదలుకుని, ఇతరత్రా అంశాలపై తనపై భారం లేకుండా పవన్ చేసుకోగలిగారు. అదే ఆయన కోరుకున్నది కూడా.