ప్రతిసారి రిజర్వుడు సీట్లు మారిస్తే ఏమవుతుంది?

దేశంలో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో ప్రతిపాదించనున్న బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు మూడు దశాబ్దాలుగా నిరీక్షణలో ఉన్న మహిళా రిజర్వేషన్ వ్యవహారం.. త్వరలోనే చట్ట…

దేశంలో మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ లోక్సభలో ప్రతిపాదించనున్న బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు మూడు దశాబ్దాలుగా నిరీక్షణలో ఉన్న మహిళా రిజర్వేషన్ వ్యవహారం.. త్వరలోనే చట్ట రూపం దాల్చనుంది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోనే మహిళా రిజర్వేషన్ చట్టం అమలులోకి వచ్చే అవకాశం కూడా ఉంది.  

మహిళలకు కల్పించబోతున్న 33 శాతం రిజర్వేషన్ల లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా కలిసి ఉంటాయి. అయితే ఒక కొత్త అంశం ఇప్పుడు తెరమీదకు వస్తోంది. ప్రతి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత మహిళా రిజర్వుడు స్థానాలను మారుస్తూ ఉండాలనే అంశం ఈ బిల్లులో ఉంది. ఇలాంటి ఏర్పాటు వలన ఏం జరుగుతుంది? మహిళలకు ఇది నిజంగా మేలు చేస్తుందా? లేదా, వాడు రాజకీయంగా స్థిరపడి నిలదొక్కుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుందా అనే చర్చ ఇప్పుడు  తలెత్తుతోంది.

చట్టసభలలో ఎస్సీ, ఎస్టీలకు ఉండే రిజర్వుడు స్థానాల్లో సాధారణంగా మార్పు ఉండదు. ఒక నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తి ఎంపీగా గెలిచినట్లయితే.. మళ్లీ మళ్లీ అక్కడి నుంచి గెలవడానికి తగినట్టుగా కష్టపడి పని చేసే అవకాశం ఉంటుంది.  అయితే మహిళా రిజర్వుడు స్థానాలను ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత మారుస్తూ ఉంటారు అనే ఏర్పాటు నేపథ్యంలో ఏం జరుగుతుందో, పరిణామాలు ఎలా ఉంటాయో స్పష్టత రావడం లేదు.

ఒకసారి ఒక మహిళ గెలిచిన సీటు తర్వాతి ఎన్నికల సమయానికి మహిళా రిజర్వుడు సీటుగా ఉండే అవకాశం లేదన్నమాట. దీనివలన తొలిసారి గెలిచిన మహిళలు, రెండోసారి అదే నియోజకవర్గంలో నుంచి గెలవాలనుకుంటే బహుశా పురుషులతో- తమకంటే బలమైన వారితో తలపడవలసిన అవసరం ఏర్పడవచ్చు. లేదా, ఒక మహిళా నాయకురాలు ప్రతిసారి రిజర్వు అయ్యే కొత్త నియోజకవర్గంలో పోటీ చేయాలంటే వారికి రాజకీయ మనుగడ కష్టం అవుతుంది.  

అదే సమయంలో ఒకసారి గెలిచిన మహిళలు.. తర్వాతి ఎన్నికల సమయానికి రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా సరే మళ్లీమళ్లీ గెలిచేలా తమ తమ నియోజకవర్గాలలో  కష్టపడి పని చేసినట్లయితే మరో అద్భుతం సాధ్యమవుతుంది. వారు మళ్ళీ గెలుస్తూ ఉండగా, తర్వాతి సార్వత్రిక ఎన్నికలకు కొత్తగా రిజర్వు అయ్యే 33 శాతం సీట్లు నుంచి వేరే మహిళలు గెలిస్తే.. ఆ క్రమంలో చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికంటే ఎక్కువగా మారినా కూడా ఆశ్చర్యం లేదు.  

ఇదంతా కూడా తమకు దక్కే రిజర్వుడ్ అవకాశాన్ని మహిళా నాయకురాళ్లు  ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పరిణామాలు ఎలా ఉండేటప్పటికీ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఒక శుభ పరిణామం అని పలువురు అంచనా వేస్తున్నారు.