ప్రభుత్వంపై విజయ్ ఫ్యాన్స్ తిరుగుబాటు

కోలీవుడ్ లో ప్రభుత్వాలకు హీరోలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు కొత్తేం కాదు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలకు, కోలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలకు మధ్య పైకి కనిపించని వైరం నడుస్తూనే ఉంది. ఇది కూడా…

కోలీవుడ్ లో ప్రభుత్వాలకు హీరోలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు కొత్తేం కాదు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలకు, కోలీవుడ్ లో కొంతమంది స్టార్ హీరోలకు మధ్య పైకి కనిపించని వైరం నడుస్తూనే ఉంది. ఇది కూడా అలాంటిదే. స్టాలిన్ సర్కారుపై విజయ్ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొన్ని నెలల కిందట ఓ కొత్త రూలు ప్రవేశపెట్టింది తమిళనాడు ప్రభుత్వం. ఇకపై వర్కింగ్ డేస్ లో సినిమాల స్పెషల్ షోలకు అనుమతి లేదు. ఏ సినిమా అయినా ఉదయం 9 గంటల్లోపు మొదలుపెట్టడానికి వీల్లేదు. జాతీయ శెలవు దినాలు, పండగల్ని మినహాయిస్తే.. ప్రతి రోజూ 4 షోలు మాత్రమే వేయాలి.

ఈ రూల్ అమల్లోకి వచ్చి చాలా రోజులైంది. దీనికి కారణం అజిత్ నటించిన తెగింపు అనే సినిమా. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ సినిమాకు ఉదయం 4 గంటల షోలు వేశారు. ఎర్లీ మార్నింగ్ షోలో ప్రమాదం జరిగి, ఓ వ్యక్తి చనిపోయాడు. దీంతో ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు తమిళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రీసెంట్ గా వచ్చిన రజనీకాంత్ సినిమా జైలర్ కూడా ఇదే రూల్ ప్రకారం రిలీజైంది. తమిళనాట జైలర్ సినిమాకు ఉదయం 5 గంటల షోలు పడలేదు. ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇవ్వలేదు ప్రభుత్వం. ఫలితంగా విజయ్ సినిమాకు కూడా అనుమతులు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో విజయ్ అభిమానులు భగ్గుమంటున్నారు.

తమిళనాడు కంటే మిగతా ప్రాంతాల్లోనే ఎర్లీ షోలు.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేశాడు విజయ్. ప్రస్తుతం ఇటు లోకేష్, అటు విజయ్ ఇద్దరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి నటించిన ఈ సినిమాపై సౌత్ అంతటా క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాను ఉదయాన్నే చూసే వెసులుబాటును కోల్పోయారు తమిళ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్

ఇంకా చెప్పాలంటే, లియో సినిమా ఎర్లీ షోలు తమిళనాడు కంటే ముందే హైదరాబాద్ లో పడే అవకాశాలున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ ను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమాతోనే ఈ కంపెనీ, డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లోకి అడుగుపెడుతోంది. లియో సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ లో ఈ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు పడే అవకాశం ఉంది.

అదే కనుక జరిగితే తమిళనాడు ప్రేక్షకుల కంటే ముందు లియో సినిమాను తెలుగు ప్రేక్షకులు చూస్తారు. ఇక ఓవర్సీస్ సంగతి సరేసరి. ఇదే ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ కు కడుపుమంటగా మారింది. తమ హీరో సినిమాను తమకంటే ముందు పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాల ప్రేక్షకులు చూస్తారనే ఫీలింగ్ వీళ్లను నిలవనీయడం లేదు. అందుకే ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.