జనసేన-తేదేపా పొత్తు వల్ల ఎవరికి లాభం అంటే క్షణం తడుముకోకుండా జవాబు చెప్పేయచ్చు. తెలుగుదేశానికే లాభం అని. అందువల్లే పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో సామాజిక బంధాలు వున్న మీడియా ఎగిరి గంతులేస్తోంది. అధికారంలోకి ఈ క్షణమే వచ్చేసినంత ఆనందిస్తోంది. చాలా వరకు అది వాస్తవం కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి జనసేన పొత్తు అనేది అద్భుతమైన ఆక్సిజన్ అన్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు కావడానికి జనసేన పొత్తు చాలా వరకు ఉపయోగపడుతుంది. అంతవరకు ఓకె.
కానీ జనసేన తరపున ఎందరు ఎమ్మెల్యేలు కావడానికి ఈ పొత్తు పనికి వస్తుంది అన్నది ప్రశ్న. ఇది కేవలం ఓట్ల బదిలీ మీద ఆధారపడుతుంది. జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి చాలా వరకు బదిలీ అవుతాయి. అందులో సందేహం లేదు. కానీ తెలుగుదేశం ఓట్లు జనసేనకు ఏ మేరకు బదిలీ అవుతాయి అన్నదే సమస్య.
ఎందుకుంటే జనసేనకు ఎక్కడా సిట్టింగ్ అభ్యర్థులు లేరు. నియోజకవర్గాల్లో పాతుకపోయిన వారు లేరు. కానీ తెలుగుదేశం పరిస్థితి అలా కాదు. నలభై ఏళ్లుగా లోకల్ లీడర్లు వున్నారు. పదవులు అనుభవించిన వారు వున్నారు. అనుభవిస్తున్న వారు వున్నారు. ఇప్పుడు జనసేనకు ఇచ్చే పాతిక.. ముఫై సీట్ల కారణంగా నియోజకవర్గాల్లో తమ అధికారం కోల్పోయే జనాలు చాలా మందే వుంటారు. ఇక్కడ జనసేన అభ్యర్ధులను నిలబెడితే, వారు గెలిస్తే ఇక వీరి ప్రాభవం మసకబారడం మొదలవుతుంది. అక్కడే వస్తుంది సమస్య.
ఎంత పార్టీ సముదాయించినా, వీరు వినడం కష్టమే. అలా అని తెలుగుదేశం తనకు బలంగాలేని స్థానాలు కేటాయించినా జనసేన గెలుచుకురావడం కష్టమే. అందువల్ల ఇక మిగిలిన మార్గం ఒక్కటే పార్టీ కేడర్ బలంగా వుండాలి. బలమైన నాయకుడు ఉండకూడదు. అలాంటి చోట్లు వెదికి మరీ జనసేనకు కేటాయించాలి. అలాంటివి చాలా తక్కువ వుంటాయి. ఉదాహరణకు కాకినాడ రూరల్ లాంటివి. అక్కడ పార్టీ కేడర్ గట్టిగానే వుంది. కానీ లీడర్ షిప్ అంత కాదు. ఇలాంటివి రాష్ట్రం మొత్తం మీద ఓ అరడజను వరకు మాత్రమే వుంటాయి. మిగిలిన వాటిని ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.
వైకాపాకు ఓ యాభై నుంచి అరవై బలమైన స్థానాలు వున్నాయి అనుకుంటే ఇప్పుడు ఈ జనసేనకు ఇచ్చే స్థానాలు కలిసి వస్తే పరిస్థితి రివర్స్ అవుతుంది. అది జరగకుండా చేయడమే తెలుగుదేశం మీద వున్న బాధ్యత. జనసేన మీద వున్న బాధ్యత కాదు. ఎందుకంటే ఓట్ల బదిలీ అటు వైపు నుంచి జరగడమే కీలకం కనుక.