వైసీపీకి చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పుట్టిన రోజు వేళ ఒక కోరిక కోరారు. తనకు ప్రత్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబే రావాలని అంటున్నారు. బాబు పోటీ చేస్తే ఆయన్ని ఓడిస్తామని కూడా సవాల్ చేస్తున్నారు.
ఎంపీ ఎంవీవీకి విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలను వైసీపీ అధినాయకత్వం అప్పగించింది. అక్కడ మూడు సార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. మరోసారి ఆయనే పోటీ చేస్తారని టీడీపీ అంటొంది. ఇప్పటికే పదిహేనేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి మీద వ్యతిరేకత కూడా పెరుగుతోంది.
దాంతో తన గెలుపు నల్లేరు మీద నడక అని ధీమాగా ఉన్నారు విశాఖ ఎంపీ. విశాఖ తూర్పులో తన విజయాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని అన్నారు. తన మీద చంద్రబాబు పోటీ చేసి గెలవాలని కూడా అదే ఉత్సాహంతో ఆయన సవాల్ చేశారు.
చంద్రబాబు పోటీ చేసినా తూర్పులో వైసీపీ విజయంలో మార్పు రాదని, ప్రజల తీర్పు అదేనని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎపుడూ టీడీపీతోనే ఉన్నారని, కొత్తగా పొత్తులు అని చెప్పడమేంటని ఎంపీ ఎద్దేవా చేశారు. ఎన్ని పార్టీలు కలసి వచ్చినా తమకు ఎలాంటి భయం లేదని ఒంటరిగానే పోటీ చేసి మరోమారు గెలిచి తీరుతామని ఎంవీవీ అంటున్నారు.
మరోసారి జగనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, గడప గడపకు తిరుగుతున్న తమకు ఆ ఫీడ్ బ్యాక్ ఉందని ఆయన చెప్పారు. వైసీపీ పాలనలో విశాఖ అభివృద్ధి చెందిందని ఎంవీవీ అన్నారు. చంద్రబాబుని అయినా ఓడిస్తాను అని ఎంపీ అంటూంటే వెలగపూడి ఆలోచించుకోవాల్సిందేనా అని అంతా అంటున్నారు.