దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ అదుర్స్ అనిపించారామె. మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్ధమని ఇప్పటికే ఆమె ప్రకటించారు. ఇండస్ట్రీలో మొదటి నుంచి ఓ పేరున్న హీరోయిన్ విజయశాంతి ఉంటే ఆ సినిమాకు అసెట్ అని దర్శకనిర్మాతలు భావిస్తున్న మాట నిజం.
అయితే ఇదే అవకాశంగా తీసుకుంటున్న విజయశాంతి తాను సినిమాలో నటించాలంటే అని కొన్ని షరతులు చెబుతున్నారట. ఆ షరతులు విన్న వారు వామ్మో…విజయశాంతికిచ్చే రెమ్యునరేషన్ కంటే ఇవే ఎక్కువ భయపెడుతున్నాయో అని పెదవి విరుస్తున్నారట.
ఇంతకూ ఆమె విధిస్తున్న షరతులు ఏంటంటే….
స్టార్ హీరో సినిమాల్లో మాత్రమే నటిస్తారట. సినిమా ప్రచారంలో హీరోతో పాటు సమాన ప్రాధాన్యం ఇవ్వాలట. తాను ప్రముఖంగా కనిపించేలా ఉండాలట. అలాగే వర్థమాన హీరోలు; పేరు, ఊరు లేని వారితో తీసే సినిమాల కథే చెప్పొద్దని అంటున్నారట. దానివల్ల టైం వేస్ట్ అని ఆమె నిర్మొహమాటంగా చెబుతున్నారట. హీరోతో పాటు తనకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మరీ చెబుతున్నారట.
మరీ ముఖ్యంగా తనకు సంబంధించిన పాత్ర నిడివి గురించి ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా ఉండాలని, అలాగే తనపై చిత్రీకరించినవేవీ తొలగించకూడదని ….అప్పుడు మాత్రమే తాను కథ వినడానికి సిద్ధమని విజయశాంతి షరతుల గురించి చిత్రపరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అమ్మా తల్లీ …ఈ షరతులే నిజమైతే భవిష్యత్‌లో ఇక విజయశాంతి ‘సినిమా’ ఆడినట్టే