తను పట్టుకుంటే తుపాకీకి ధైర్యం వస్తుంది

క్యారెక్టర్ ఎంతో బాగుంటే తప్ప సినిమా చేయడానికి అంగీకరించరు విజయశాంతి. ‘డబ్బు కోసం సినిమా చేయను, పాత్ర నచ్చితే చేస్తాను, లేదంటే చేయను’ అంటూ నిక్కచ్చిగా చెబుతారామె. అందుకే సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్…

క్యారెక్టర్ ఎంతో బాగుంటే తప్ప సినిమా చేయడానికి అంగీకరించరు విజయశాంతి. ‘డబ్బు కోసం సినిమా చేయను, పాత్ర నచ్చితే చేస్తాను, లేదంటే చేయను’ అంటూ నిక్కచ్చిగా చెబుతారామె. అందుకే సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా విజయశాంతి నుంచి సినిమాలు రాలేదు. పదుల సంఖ్యలో పాత్రలొచ్చినా తిరస్కరించానని తనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఎట్టకేలకు ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు విజయశాంతి. ఈ సినిమాలో ఆమె వైజయంతీ ఐపీఎస్ గా కనిపించబోతున్నారు. ఆ క్యారెక్టర్ గ్లింప్స్ ను ఈరోజు రిలీజ్ చేశారు.

“తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది, వేసుకుంటే యూనిఫామ్ కు పౌరుషం వస్తుంది” అనే పవర్ ఫుల్ లైన్స్ తో విజయశాంతి క్యారెక్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ ఛాయల్ని చూపించారు విజయశాంతి. ఆమె ఇందులో యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నారు.

దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు విజయశాంతి. మళ్లీ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రదీప్ చిలుకూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.