ఎన్నికల్లో దారుణ ఓటమిని మూటకట్టుకున్న వైఎస్ జగన్… ఫలితాల తర్వాత మొదటిసారి పులివెందుల వెళ్లారు. అధికారం పోగొట్టుకున్న జగన్‌కు జనం నుంచి ఆదరణ వుంటుందో, లేదో అనే అనుమానం వైసీపీలో ఉండింది. అయితే అధికారాన్ని పోగొట్టుకుని సొంతూరికి వెళ్లిన జగన్‌ను ఓదార్చడానికి జనం పోటెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం జగన్ పులివెందులకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇప్పటికి రెండు రోజులు గడిచిపోయాయి. మూడో రోజు సోమవారం కూడా పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు జగన్ అందుబాటులో ఉండనున్నారు. మొదటి రోజు మధ్యాహ్నానికి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌కు ఘన స్వాగతం లభించింది. అప్పటి నుంచి అడుగడుగునా జగన్ వెంట జనం కనిపించడం విశేషం.
జగన్‌ను కలుస్తున్న ప్రజానీకం, ఆయన్ను ఓదార్చుతుండడం గమనార్హం. ఓటమికి దారి తీసిన క్షేత్రస్థాయి పరిస్థితుల్ని జగన్‌కు జనం వివరిస్తున్నారు. వాటని జగన్ శ్రద్ధగా వింటున్నారు. ఐదేళ్లు గట్టిగా ఓర్చుకుంటే, మళ్లీ మనదే అధికారం అని ప్రజలకు ఆయన భరోసా ఇస్తున్నారు. చంద్రబాబునాయుడు అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చారని ప్రజలతో జగన్ అంటున్నారు.
హామీల్ని అమలు చేయడం సులువు కాదని జగన్ చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే, రానున్న రోజుల్లో పోరాటాలు చేస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు. ఇదిలా వుండగా వైసీపీ పెట్టిన కొత్తలో జగన్‌కు జనం నీరాజనం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాటి రోజుల్ని గుర్తు చేస్తోందని జగన్‌ను కలవడానికి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఘోర పరాజయం పొందినప్పటికీ, 40 శాతం ఓటు బ్యాంక్ వైసీపీకి ఉండడం ప్రత్యర్థుల్ని భయపెడుతోంది. అయితే లోపాల్ని సరిదిద్దుకుని, సరైన టీమ్‌తో ముందుకెళ్లడం జగన్ చేతల్లో వుంది. ఆ పని ఆయన ఏ మేరకు చేస్తారనేది ప్రశ్నార్థకమైంది. ఓటమికి దారి తీసిన పరిస్థితులపై నిర్మొహమాటంగా విశ్లేషించుకోవాల్సిన తరుణం ఇదే. జగన్ తమను కలవలేదనే ఆవేదన, ఆగ్రహం ముఖ్యంగా కేడర్‌లో ఇంతకాలం వుండింది. దాని ఫలితమే ఎన్నికల్లో ఘోర పరాజయం.
జరిగిపోయిన కాలం గురించి కాదు, భవిష్యత్‌పై జగన్ దృష్టి సారించాలి. గతంలో తన వైపు నుంచి జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా జగన్ చూసుకోవాలి. అలా చేస్తే ఆదరించడానికి జనం ఎప్పుడూ సిద్ధమే. దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడం జగన్ ఆలోచనపై ఆధారపడి వుంటుంది. ఏం చేస్తారో చూడాలి.