కొట్టిన నిఖార్సైన హిట్ సినిమాలు మూడంటూ మూడే, ఆ తర్వాత మరో మూడు సినిమాల ఫెయిల్యూర్లే ఉన్నాయి. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో ఇంటాబయట మార్మోగిన పేరు విజయ్ దేవరకొండది. పెళ్లి చూపులు సినిమా జాతీయ అవార్డుల జాబితాలో నిలిచి ప్రత్యేకతను చాటితే, అర్జున్ రెడ్డితో విజయ్ రాత్రికి రాత్రి స్టార్ అయ్యాడు!
కేవలం తెలుగుకే పరిమితం కాకుండా.. ఇండియా వ్యాప్తంగా విజయ్ దేవరకొండకు గుర్తింపు తెచ్చి పెట్టింది ఆ సినిమా. అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసినా, ఆ తర్వాత మళ్లీ తెలుగు అర్జున్ రెడ్డిని హిందీలోకి అనువదించుకుని చూశారంటే.. ఈ హీరోకి అక్కడ ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇక గీతాగోవిందంతో యువతకు మరింత చేరువయ్యాడు ఈ హీరో. ఆ తర్వాత నోటా, డియర్ కామ్రేడ్ లతో నిరాశ పరిచినా.. విజయ్ దేవరకొండ తదుపరి సినిమాపై యువతలో ఆసక్తి ఏమీ తగ్గడం లేదు!
ఆ సంగలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలను విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ చిన్నబోయేలా చేస్తోంది. ఇన్ స్టాగ్రమ్ లో విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలకు అందని స్థాయికి వెళ్తున్నాడు.
ఇప్పటికే ఆ సోషల్ మీడియా సైట్లో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ ఐదు మిలియన్ల స్థాయికి చేరింది. మహేశ్ బాబుకు కూడా అక్కడ ఉన్న ఫాలోయర్లు నాలుగు మిలియన్ల స్థాయిలోనే, అల్లు అర్జున్ కు నలభై ఎనిమిది లక్షల స్థాయి ఫాలోయర్లు ఉండగా.. అతడిని క్రాస్ చేసి విజయ్ ఐదు మిలియన్ల స్థాయికి చేరాడు! యువతరం ఇప్పుడు కేరాఫ్ ఇన్ స్టాగ్రమ్ గా మారింది. ఇలాంటి నేపథ్యంలో అక్కడ సీనియర్ స్టార్ హీరోల కన్నా విజయ్ దేవరకొండకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తూ ఉండటం గమనార్హం!