మన దేశంలో అత్యాచారాలు జరగని రోజు లేదు. పత్రికల్లో ప్రతి రోజు నాలుగైదు అత్యాచారాల వార్తలు కనబడుతూనేవుంటాయి. టీవీ పెడితే అత్యాచార వార్తలు కనబడుతూ వినబడుతూ ఉంటాయి. ఛానెళ్లలో ప్రముఖులతో, తల్లిదండ్రులతో, మేధావులతో చర్చా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సామాజిక మాధ్యమాల సంగతి సరేసరి. ఎన్ని చర్చలు జరుగుతున్నా, ఎంతటి మేధోమథనం జరుగుతున్నా, ఎందరో ఎన్నో మాట్లాడుతున్నా అత్యాచారాలకు కారణమేమిటి? అనేది తెలియడంలేదు. ఇది విచిత్రం. అత్యాచారాలు జరగకుండా చూడటానికి ఎవరికి తోచిన సలహాలు, సూచనలు వారు ఇస్తున్నారు. కాని ఒకరు చెప్పినదాంతో ఇంకొకరు ఏకీభవించడంలేదు. ఈ చర్చల్లోకి స్వామీజీలు కూడా ఎంటరవుతున్నారు. సామాజిక కార్యకర్తలు వస్తున్నారు. మహిళా సంఘాలు, మేధావులు వస్తున్నారు.
అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని, మరింత కఠిన చట్టాలు తేవాలంటున్నారే శాశ్వత పరిష్కారం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. నిజానికి ఒక నిర్దిష్ట కారణమంటూ లేదు కదా. అత్యాచారాలకు బలవుతోంది నిరక్షరాస్యులు, గ్రామీణులు, పేదవారే కాదు, బాగా చదువుకున్నవారు, సంపన్నులు, ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉన్నారు. కఠిన శిక్షలు విధిస్తామని ప్రభుత్వాలు ఎంతగా హెచ్చరిస్తున్నా, చట్టాలకు పదును పెడుతున్నా అత్యారాలు ఆగడంలేదు. ఇదో వైరస్‌లా దేశమంతా పాకిపోయింది. యువతులు, మహిళల మీదనే కాకుండా, అభంశుభం తెలియని నెలల పిల్లల మీద కూడా దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారంటే ఏం కారణాలు చెబుతాం? ఇది ఉన్మాదమనుకోవాలా? కొందరు ఆధునిక టెక్నాలజీయే అత్యాచారాలకు కారణమంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లను నిందిస్తున్నారు. రకరకాల ఫీచర్లతో, ఆధునిక హంగులతో ఉన్న సెల్‌ఫోన్లు అత్యాచారాలకు కారణమంటున్నారు.
మరి ఇంత హాని కలిగిస్తున్న స్మార్ట్ ఫోన్‌లను దేశంలో లేకుండా చేయగలరా అంటే అది సాధ్యం కాదు. వాటిపై ఏమైనా నిషేధాలు విధించగలరా? అదీ సాధ్యం కాదు. తల్లిదండ్రులే పిల్లల్ని సరైన దార్లో పెట్టాలంటున్నారు. ఇక పోర్న్ వెబ్‌సైట్లు అత్యాచారాలకు కారణమంటున్నారు. చట్టసభల్లో గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీలే సమావేశాలు జరుగుతున్నప్పుడే తమ ఫోన్లలో పోర్న్ వీడియోలు చూసిన సందర్భాలున్నాయి. మరి పిల్లలకు వారేం చెప్పగలరు? ప్రభుత్వాలు పోర్న్ సైట్లు వందశాతం అంటే పూర్తిగా నిషేధించడంలేదు. ఇక అత్యాచారాలు జరగడానికి సినిమాలు కారణమని కొందరు అంటున్నారు. దీన్ని సినిమావారు అంగీకరించడంలేదు. సమాజంలో జరిగేదే తాము చూపిస్తున్నామని, అత్యాచారాలకు సినిమాలకు సంబంధ లేదని అంటున్నారు.
ఈ కారణాలన్నీ ఒక ఎత్తయితే, యువతులు, మహిళల వస్త్రధారణ కూడా అత్యాచారాలకు కారణమవుతోందని కొందరు అంటున్నారు. అయితే వస్త్రధారణ గురించి ఎవరైనా ప్రస్తావిస్తే మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. కొందరు స్వామీజీలు, నాయకులు వస్త్రధారణ హుందాగా లేకపోతే అత్యాచారాలు జరగడానికి ఆస్కారముందన్నారు. దీంతో మహిళా సంఘాలు దీన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. ఇష్టమైన డ్రస్సులు వేసుకునే స్వేచ్ఛ లేదా? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలేదని, అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళలు అంటున్నారు.
దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఒక మంత్రి 'ప్రతి ఇంటికీ ఒక పోలీసును పెట్టలేము కదా' అని చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కాలంలో ఆడపిల్లలు చదువుకునే పరిస్థితి లేదని, ఉద్యోగాలు చేయాలంటే భయపడుతున్నారని కొందరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలను చదువులకు, ఉద్యోగాలకు బయటకు పంపడం కంటే ఇంట్లో ఉంచుకోవడమే మంచిదని కొందరంటున్నారు. ఇంతకూ అత్యాచారాలకు కారణమేమిటి?