ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ ఈ రోజు తెల్లవారుజామున ఆస్పత్రి పాలయ్యారు. దీంతో డీఎండీకే కార్యకర్తల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ ఆందోళన నెలకుంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జనరల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రిలో చేరినట్టు డీఎండీకే ఒక ప్రకటన విడుదల చేసింది.
శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విజయ్‌కాంత్‌ను చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్‌కాంత్ కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన ఆస్పత్రిలో చేరి ట్రీట్‌మెంట్ తీసుకుని కోలుకున్నారు. అనంతరం ఆయన భార్య ప్రేమలత కూడా మహమ్మారి నుంచి తప్పించుకోలేక పోయారు. ఆమె కూడా త్వరగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌కాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కరోనా బారిన పడినప్పటి నుంచి శ్వాసకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఆయన కోలుకున్నప్పటికీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. దీంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకు నేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఇబ్బందేమీ లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తన వంతు పాత్రను పోషించిన విజయకాంత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. కానీ వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించడంలో విజయకాంత్ ఎప్పుడూ ముందుంటారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఆయన సక్సెస్ అయ్యారు.