అభిమానులకు ఎన్టీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ ఏడాది తన పుట్టినరోజు నాడు(మే 20) ఏవిధమైన వేడుకలు చేయవద్దని సూచించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలోనే కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానని పేర్కొన్నారు. తారక్ తన అభిమానులకు రాసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం ఇదీ…
‘ప్రస్తుతం నేను బాగున్నాను..త్వరగానే కోవిడ్‌ను జయించి పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నాను. ప్రతీ సంవత్సరం నా పుట్టిన రోజున మీరు చూపించే ప్రేమ, సేవా కార్యక్రమాలు ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈసారి మీరు ఇంటి వద్దే ఉంటూ లాక్‌డౌన్, కర్ఫ్యూ నియమాలను తప్పక పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే మీరు అందించే అతిపెద్ద కానుక.
ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు మనం సంఘీభావం తెలపాలి. ఎందరో తమ ప్రాణాలను, జీవనో పాధిని కోల్పోయారు. కుదిరితే అలాంటి కుటుంబాలకు అండగా నిలవాలి.
మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ , చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుందని నమ్ముతున్నాను. ఆ రోజు అందరం కలిసి వేడుక చేసుకుందాం. అప్పటి వరకు మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి.
నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ…’ అని తారక్ సోషల్ మీడియా వేదికగా లేఖ రాశారు. మరి ఇష్టమైన హీరో విన్నపాన్ని అభిమానులు ఎంత వరకూ ఆచరిస్తారో చూడాలి.