గీతా సంస్థ నిర్మిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఎలా వుంటుంది అన్నది విడుదల తరువాత తెలిసే సంగతి. కానీ ముందుగా విడుదల చేస్తున్న పాటలు మాత్రం ఓ అభిరుచితో చేయించుకున్నట్లు కనిపిస్తోంది. సాహిత్యం లోతు, అర్థం తెలియకున్నా, ముందుగా విడుదల చేసిన ‘వాస సుహాస’ అన్న గీతం ఓ నిండైన పాటలా ఫీల్ ను కలిగించింది. చాన్నాళ్ల తరువాత ఓ స్థాయి వున్న పాట అని అనుకునేలా చేసింది. అందులో ఏం అర్థం వుంది..సరైన సమాసాలా? గ్రామర్ సరిపోయిందా? లేదా అన్న సంగతి పండితులు చూసుకుంటారు. కానీ పామరుల విషయంలో మాత్రం ఓ గౌరవ ప్రదమైన పాటగా నిలిచిపోతుంది.
తరువాత విడుదల చేసిన ‘ఓ బంగారం’ అనే పాట రెగ్యులర్ కమర్షియల్ సాంగ్ నే అయినా దాని ట్యూన్ కూడా అల్లరి చిల్లరిగా కాకుండా ఓ బీట్ తో పద్దతిగా వినిపించింది. దానికి అందించిన ఇనుస్ట్రుమెంటేషన్ కూడా సున్నితంగా వినాలి అనిపించేలా వుంది.
ఇప్పుడు విడుదల చేసిన తిరుపతి పాట కూడా బాగుంది.’చుక్కులెత్తుకొండలే నిండినా శ్రీపురం..నెత్తి కొప్పు దేవుడీ కాపురం..మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం..వెంకన్నసామికున్న వెండిదోరం..’ అంటే ఈ పాట తిరుపతి వాసులకు భలే గౌరవంగా, మురిపెంగా అనిపిస్తుంది. ఇలాంటి పాటలు గతంలో వేటూరి అద్భుతంగా కలకత్తా, మధురైల మీద రాసారు. ఇది అంత లోతైన అధ్యయనంతో సాగిన రచన కాదు కానీ, సింపుల్ గా బాగుంది. ఈపాటలో మంచి పద ప్రయోగాలు వున్నాయి.
పాటలు అన్నీ సింగిల్ కార్డ్ అనుకోవాలేమో. త్రివిక్రమ్ పరిచయం చేసిన గేయ రచయితే త్రిపురనేని కళ్యాణ చక్రవర్తి ఈ పాటలు రాసారు. కొత్త దర్శకుడు అబ్బూరి మంచి సాహిత్యం వున్న పాటలు రాయించుకున్నట్లు కనిపిస్తోంది. చేతన్ భరద్వాజ్ కూడా విభిన్నమైన ట్యూన్ లు అందించారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాత బన్నీ వాస్.