సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉంది. ఈ దఫా ఎన్నికలు భీకర పోరును తలపించడం ఖాయం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఒకవేళ టీడీపీ ఓడిపోతే… చంద్రబాబుకు వయసు పైబడడం, వారసుడైన లోకేశ్ ఆశించిన స్థాయిలో నాయకత్వ లక్షణాలు ప్రదర్శించకపోవడం… తదితర కారణాలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తాయి.
ఒకవేళ వైసీపీ ఓడిపోతే ….ఆ పార్టీ పరిస్థితి కూడా అంతే. జగన్‌కు ఇంకా 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగేంత వయసు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకత్వాన్ని బలహీనపరిచారు. అలాగే జగన్‌ను అధికారంలోకి తెచ్చుకుంటే తమ బతుకులు బాగుపడతాయనే నమ్మకాన్ని నాయకుల్లో పోగొట్టడంలో జగన్ సక్సెస్ అయ్యారు. దీంతో జగన్ కోసం పని చేయాలన్న ఉత్సాహంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల్లో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా భావోద్వేగం పునాదుల మీద వైఎస్సార్‌సీపీ అవతరించిందన్న వాస్తవాన్ని గుర్తించుకోవాలి. భావోద్వేగం ఎప్పుడూ ఒకేలా వుండదు. ఈ కారణాల వల్ల వైసీపీ భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తాయి.
విజయం, అధికారం అనేవి లోపాలను మరుగున పరుస్తాయి. విజేతల సానుకూల అంశాల్నే చరిత్ర లిఖిస్తుందనే వాస్తవాన్ని మనం మరిచిపోకూడదు. అందుకే అధికారం కోసం వైసీపీ, టీడీపీ ఈ దఫా “డూ ఆర్ డై” అనే రేంజ్‌లో తలపడనున్నాయి. సీఎం జగన్‌లో తెగించి పోరాడే గుణం వుంది. నిర్ణయాలు తీసుకోవడంలో నాన్చివేత ధోరణి వుండదు. మరీ ముఖ్యంగా నాయకుల కంటే జనాన్ని నమ్ముకోవడమే జగన్ విజయ రహస్యం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్‌సభ సభ్యులను చంద్రబాబు టీడీపీలో చేర్చుకుంటే, జగన్ చెక్కు చెదరకపోవడం మన కళ్లెదుటే నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
ఇటీవల తోక జాడించిన వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను సీఎం జగన్ వెనుకాముందు ఆలోచించకుండా తప్పించారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించి, తన నాయకత్వ సమర్థతను నిరూపించుకున్నారు. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే… విజయవాడ ఎంపీ కేశినేని నాని పలుమార్లు ధిక్కరణ ధోరణితో వ్యవహరించినా చర్యలు తీసుకోడానికి ధైర్యం చేయలేకపోయారు. అలాగే నంద్యాలలో జోక్యం చేసుకోవద్దని మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు పదేపదే చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఆమెపై చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేకపోయింది.
విజయవాడ, మైలవరం, తుని, ప్రొద్దుటూరు, తిరుపతి, సత్యవేడు తదితర నియోజకవర్గాల్లో పార్టీలో చోటు చేసుకున్న విభేదాలను తొలగించేందుకు చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు భయమే ఆయనకు శాపమైంది. ఉదాహరణకు కర్నూలులో టీజీ వెంకటేశ్ బీజేపీ నాయకుడిగా, ఆయన తనయుడు టీజీ భరత్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. టీజీ వెంకటేశ్ బీజేపీలో ఉండడం వల్ల ఆ ప్రభావం టీడీపీపై పడుతోంది. ఇక్కడ చర్యలు తీసుకోడానికి చంద్రబాబు సాహసించడం లేదు. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి చంద్రబాబే పంపాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా చంద్రబాబు ఇక్కడ వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతానికి వస్తే సీఎం జగన్ మరోసారి ఎన్నికల సమరానికి తన సైన్యాన్ని సమాయత్తం చేయడంలో రోజురోజుకూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే… ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర పోసిస్తు న్నారు. వాలంటీర్లతోనే సమస్య అని ప్రతిపక్షాలు తల్లడిల్లుతున్న సమయంలో, వారికి తోడుగా 5.65 లక్షల మంది గృహసారథులను నియమించి, ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి జగన్ ఊపు మీద ఉన్నారు. మార్చి 18 నుంచి జగన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించనున్నారు.
ఈ రీతిలో జగన్ దూకుడు ప్రదర్శిస్తుంటే, చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ ఏం చేస్తున్నట్టు? ఎంత సేపూ జగన్‌పై విమర్శలకే వారు పరిమితం అవుతున్నారు. కేవలం విమర్శలు, దూషణలు మాత్రమే తమకు అధికారం తీసుకురావని ప్రతిపక్ష నేతలకు తెలియదని అనుకోలేం. అలాగని జగన్ మాదిరిగా వ్యూహాలు రచించడంలో మాత్రం ప్రతిపక్ష నేతలు అట్టర్ ప్లాప్ అయ్యారని చెప్పొచ్చు. ఎన్నికలంటే ఎత్తుకు పైఎత్తులే కదా!
‘జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ జనాన్ని తమ వైపు తిప్పుకోడానికి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్షలాది సైన్యం ఎన్నికలకు ఏడాది ముందు నుంచే యుద్ధానికి దిగుతోంది. ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని వైసీపీ నలుదిక్కులా చుట్టుముడుతోంది. తన గురించి తప్ప, మరో నాయకుడి గురించి ఆలోచించనివ్వకూడదని జగన్ పద్మవ్యూహాన్ని తలపించే యుద్ధ తంత్రాన్ని పన్నుతున్నారు. దాన్ని ఛేదించడం ప్రతిపక్షాలకు అంత సులువైన పని మాత్రం కాదు.
జగన్ ఎన్నికల వ్యూహం చూస్తుంటే… ప్రతిపక్షాల నేతలే ముచ్చటపడేలా వుంది. ఇక వైసీపీ ప్రజాప్రతినిధులకు ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.