తిరుపతిలో జనసేనకు టీడీపీ షాక్ ఇచ్చింది. టీడీపీతో పొత్తులో భాగంగా తిరుపతి టికెట్‌ను జనసేన ఆశిస్తోంది. తిరుపతిలో పవన్‌కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, అందుకే జనసేనకు కేటాయించాలనే డిమాండ్ ఆ పార్టీ నేతల నుంచి వస్తోంది. టీడీపీతో పొత్తు తప్పనిసరిగా వుంటుందని జనసేన ఊహించుకుంటోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తమ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ పరిశీలకుడు బీద రవిచంద్ర తిరుపతి నియోజకవర్గ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఈ సారి ఎలాగైనా తిరుపతిలో టీడీపీ జెండా ఎగరాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే తిరుపతి టీడీపీ నేతలు క్షేత్రస్థాయిలో పని చేయకుండా పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకుంటున్నారని, ఈ వైఖరి ఆయనకు నచ్చడం లేదని బీద చెప్పారు.
బీద వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి టికెట్‌ను తాము అడుగుతున్నామని తెలిసి కూడా, టీడీపీ జెండా ఎగరేయాలని కోరుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ మద్దతు లేకుండా తిరుపతిలో టీడీపీ గెలిచే సత్తా వుందా? అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
జనసేన తప్పక గెలుస్తుందనే నమ్మకం ఉన్న తిరుపతి లాంటి సీటు కాకుండా, ఓడిపోయే నియోజకవర్గాన్ని ఇస్తే ఏం చేసుకోవాలని జనసేన నేతలు నిలదీస్తున్నారు. కావున తిరుపతి టికెట్ తమకు కాదని టీడీపీ నిలబడితే మాత్రం… అంతు చూస్తామని జనసేన నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితిని తిరుపతిలో చూడొచ్చు.