ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్కేకు చంద్రబాబు అంటే ఎంత ఆరాధనో ఆయన పత్రికలో రాసిన తప్పుడు లెక్కలే నిదర్శనమే. వాస్తవం ఏంటో రామోజీరావు తన ఈనాడు పత్రికలో రాసి, ఆర్కే నిజ స్వరూపాన్ని బయట పెట్టినట్టైంది. విజయవాడలో సాంస్కృతిక కేంద్రమైన ‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’కు పేరు విషయమై ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తోంది.
తుమ్మలపల్లి, అలాగే క్షేత్రయ్య పేర్లను తొలగించి, కేవలం కళాక్షేత్రంగా మిగిల్చారని ఎల్లో మీడియా ఆక్రోశం. అయితే ఈ మార్పునకు సంబంధించి ప్రభుత్వ చర్యలపై ఎలాంటి ఆధారాలు చూపలేదు. సదరు కేంద్రం పేరును ‘కళాక్షేత్రం’ అని తాటికాయంత అక్షరాలతో రాశారని గగ్గోలు పెడుతున్నారు. నిజానికి అదే జరిగి వుంటే, ప్రభుత్వ తీరును తప్పక తప్పు పట్టాల్సి వుంటుంది. ఇలాంటి చర్యలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక చారిత్రిక నేపథ్యం ఉన్న కేంద్రం పరపతిని చేతనైతే పెంచాలి. అంతే తప్ప, తగ్గించే పనులు చేయడం క్షమించరాని నేరమవుతుంది.
ఇదిలా వుండగా ఈ క్షేత్రం పురోభివృద్ధికి ఎవరెవరి హయాంలో ఎంతెంత ఖ్చు చేశారో రాసే విషయంలో వారాంతపు పలుకుల సార్ పత్రిక అత్యుత్సాహం చూపింది. తమ ఆరాధ్య నాయకుడి పాలనలో ఖర్చు చేసినట్టు చెబుతున్న లెక్కల గురించి ఏం రాశారంటే…
‘2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సుమారు రూ.50 కోట్లతో ఫేస్ లిఫ్ట్ ప్రోగ్రాం పేరుతో తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని ఆధునికీకరించారు. సీటింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ హాలును సెంట్రలైజ్డ్ ఏసీ హాలుగా మార్చారు. కళాక్షేత్రం ఆవరణలో ఫౌంటైన్లు ఏర్పాటు చేసి మరిన్ని మెరుగులు దిద్దారు’
ఇదే కళాక్షేత్రానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఖర్చులపై ఈనాడు పత్రికలో ఏం రాశారో తెలుసుకుందాం.
‘2015లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు రూ.2 కోట్ల నిధులను విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.8 కోట్లతో కళాక్షేత్రం రూపు రేఖల్ని మార్చింది. అత్యాధునిక సౌండ్ సిస్టమ్, సీటింగ్, ఏసీలు , గార్డెనింగ్‌తో కొత్త రూపురేఖల్ని తీసుకొచ్చారు. గత ఏడాది వైసీపీ ప్రభుత్వం రూ.కోటి ఖర్చు చేసి మళ్లీ ఆధునికీకరించారు’
బాబు ప్రభుత్వం రూ.8 కోట్లు ఖర్చు చేయగా, వారాంతపు పలుకుల సార్ పత్రిక మాత్రం ఆరింతలకు పైగా ఖర్చు చేసినట్టు రాయడం వారికే చెల్లింది. కోట్లాది రూపాయలతో ఆధునికీకరించినా, ఇంకా మిగిలిన పోయిన వాటికి జగన్ ప్రభుత్వం రూ.కోటి ఖర్చు చేసిన వాస్తవాన్ని వీకెండ్స్ జర్నలిస్ట్& ఓనర్ విస్మరించడం గమనార్హం. చంద్రబాబు గారి భక్తుడైన సదరు జర్నలిస్టు, యజమాని పత్రికలో వాస్తవాలు ఎలా వుంటాయో అర్థం చేసుకోడానికి ఇదొక్కటి చాలు.