వారసత్వంగా వచ్చిన సంపాదనతో రిచెస్ట్ అనిపించుకోవడం ఒక ఎత్తు అయితే, సొంత సంపాదనతో ఆ రేంజ్ లో నిలవడం మరో ఎత్తు. ప్రత్యేకించి సినిమాలు, క్రికెట్ లో రాణించడం ద్వారా రిచెస్ట్ అయిన సెలబ్రిటీలు కేవలం వ్యక్తిగత టాలెంట్ తో కళ్లు చెదిరే సంపదను పోగేసిన వారు అవుతారు. ఈ జాబితాలో ఇప్పుడు ఇండియాలో టాప్ స్టేటస్ లో ఉన్నారు అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ దంపతులు.
క్రికెటర్ గా విరాట్, నటిగా అనుష్కలు గత దశాబ్దకాలంలో ఎదిగిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే! చెరో కెరీర్ లో రాణిస్తూ ప్రేమలో పడిన వీరు, ఆ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ తమ కెరీర్ లతో బిజీగా ఉంటూ కూడా.. దంపతులుగా రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఇంతే కాదు.. వీరు ఇప్పుడు ఇండియాలో రిచెస్ట్ సెలబ్రిటీ కపుల్ గా నిలుస్తున్నారు. కేవలం సొంత సంపాదనతోనే వీరు ఈ ఖ్యాతిని జాయింటుగా పొందుతున్నారు.
ఈ సెలబ్రిటీ కపుల్ ఆస్తులు కళ్లు చెదిరే స్థాయిలో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. వివిధ సందర్భాల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ దంపతుల ఆస్తిపాస్తుల వివరాలను ఒక సారి తరచి చూస్తే!
జాయింటుగా వీరి ఆస్తుల విలువ వందల కోట్లలో ఉండవచ్చు. స్టార్ క్రికెటర్ గా విరాట్ కొహ్లీ సంపాదన అటు మ్యాచ్ ఫీజులు, ఇటు ఎండోర్స్ మెంట్ ఒప్పందాలతో కొహ్లీ వార్షిక రాబడులు వంద కోట్ల రూపాయలకు పై మాటే. ఇక హీరోయిన్ గానే కాకుండా, నిర్మాతగా కూడా అనుష్కా శర్మ వ్యవహరిస్తోంది.
అంతే గాక.. అనుష్క ఒక క్లోత్ బ్రాండ్ కు ఓనర్ కూడా. నుష్ పేరుతో ఆమె వస్త్రాల వ్యాపారం చేస్తోంది. దాని విలువ దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలని అంచనా.
గుర్గావ్ లో విరాట్ కొహ్లీకి సొంతంగా ఒక బంగ్లా ఉంది. దాని ఒక్కదాని విలువే సుమారు 80 కోట్ల రూపాయలు ఉండవచ్చు!
అనుష్కకు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే లాండ్ రోవర్ కారు ఉంది. విరాట్ కు కూడా ఒక్కోటి దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే రెండు కార్లున్నాయి.
అనుష్కకు ముంబైలో ఉన్న ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ విలువ సుమారు పది కోట్ల రూపాయలు! అలాగే ఆమెకు అంథేరీలో నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే మరో ఇల్లుంది.
లగ్జరీ వాచ్ లు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు వీరి సొంతం. ఇలాంటి వాటి విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది.
ఈ దంపతులకు ముంబైలో జాయింటుగా ఒక ఫోర్ బెడ్రూమ్ అపార్ట్ మెంట్ ఫ్లాటుంది. దీని విలువ చుక్కలనంటే స్థాయిలో ఉంటుంది. సుమారు 34 కోట్ల రూపాయలని అంచనా!
అనుష్క, విరాట్ కొహ్లీలకు సంబంధించి ఆస్తుల్లో ఇవి మచ్చుకు కొన్ని. ఇంకా వీరి పెట్టుబడులు రకరకాల రంగాల్లో విస్తరించి ఉన్నాయి.