డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సినిమా వచ్చిందంటే ఉత్తరాంధ్రలో కాస్త హడావుడే. ఎందుకంటే ఆ మూడు జిల్లాల్లో థియేటర్లు ఎక్కువగా ఆయన దగ్గర వున్నాయి. తమవి కాని సినిమాలు విడుదలయితే, తమ సినిమాలకు కలెక్షన్లు లేకున్నా థియేటర్లు ఖాళీ చేయకుండా వుండడం వంటి వ్యవహారాలు వుంటాయని టాక్ వుంది.
లేటెస్ట్ వ్యవహారం ఏమిటంటే దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా తొలిసారి చేస్తున్న రౌడీ బాయిస్ సినిమా వస్తోంది. విశాఖలో కీలకమైన మెలోడీలో శ్యామ్ సింగ రాయ్ ఆడుతోంది.అది ఆర్ఆర్ఆర్ వరకు అని దిల్ రాజుకే అగ్రిమెంట్ వుంది.
అక్కడ రౌడీ బాయిస్ వేయమంటే వాళ్లు బంగార్రాజు అయితేనే ఓకె అన్నారు. దాంతో అగ్రిమెంట్ కంటిన్యూ చేస్తూ శ్యామ్ సింగ రాయ్ నే వుంచమని దిల్ రాజు కోరినట్లు తెలుస్తోంది. నిజానికి శ్యామ్ కు కలెక్షన్లు లేవు. ఆ సినిమానే వుంచితే పండగకు క్యాంటీన్, పార్కింగ్ డబ్బులు రావు.
జగదాంబలో పుష్ప కలెక్షన్లు వున్నాయి. ఇప్పుడు అక్కడ అది తీసి రౌడీ బాయిస్ వేయమని వత్తిడి చేస్తున్నారని బోగట్టా. అది కూడా ఆర్ఆర్ఆర్ వరకే అగ్రిమెంట్ వుంది. మరి మెలోడి కి ఒక రూలు అయినపుడు, జగదాంబకు కూడా అదే రూలు వుండాలని కదా అని పుష్ప డిస్ట్రిబ్యూటర్ ఆవేదన. అలాగే పుష్ప ఆడుతున్న అనకాపల్లి రామచంద్రను ఖాళీ చేసి రౌడీ బాయిస్ ఇవ్వాలని వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దిల్ రాజు మాట కాదు అంటే తరువాత సినిమాలు ఇవ్వరేమో అని ఎగ్జిబిటర్ల భయం.
ఇదిలా వుంటే నైజాం బి.సి సెంటర్లలో కూడా ఎగ్జిబిటర్లు తప్పనసరిగా రౌడీ బాయిస్ ను వేయాల్సి వస్తోందని తెలుస్తోంది. పండగ కు బంగార్రాజు వేస్తామన్నా రౌడీ బాయిస్ కు థియేటర్ కావాలని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.