టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి పొత్తు ప్రతిపాదన చేసిన మొదలు…జనసేన నాయకుల నుంచి గట్టి ప్రశ్న ఎదురవుతోంది. ఈ సందర్భంగా టీడీపీకి జనసేన నాయకులు, కార్యకర్తలు వివిధ మాధ్యమాల వేదికగా ఓ కండీషన్ పెడుతున్నారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీతో పొత్తుకు రెడీ అని జనసేన మనోభావం.
పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే, చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని జనసేన నాయకులు నిలదీస్తున్నారు. ఒకవైపు జనసేనతో పొత్తు ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తాను రెండేళ్లలో సీఎం అవుతానని చంద్రబాబు ప్రకటించడం ఏంటనే నిలదీతలు జనసేన నాయకుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు పొత్తు ప్రతిపాదనపై పవన్‌కల్యాణ్ నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ, జనసేన నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్న బొలిశెట్టి సత్యనారాయణ టీడీపీ అధినేత పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ట్విటర్, వివిధ మాధ్యమాల వేదికగా ఆయన పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ రాజకీయాలు స్వార్థ, దుర్మార్గమైనవని, కానీ సమాజ మార్పు కోరుతూ రాజకీయాలు చేయాలనే ఆశయంతో పవన్ ఉన్నారనే విషయాన్ని బొలిశెట్టి గుర్తు చేస్తున్నారు.
గతంలో రాష్ట్రం కోసం టీడీపీకి పవన్‌కల్యాణ్ మద్దతు ఇచ్చి చంద్రబాబును సీఎం చేశారని బొలిశెట్టి గుర్తు చేశారు. ఇప్పుడు జనసేన పార్టీకి చంద్రబాబు మద్దతు ఇచ్చి పవన్‌ను సీఎం చేసే దమ్ముందా? అని బొలిశెట్టి సత్యనారాయణ గట్టిగా ప్రశ్నించడం గమనార్హం. అలాగే ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులిద్దరూ రాష్ట్ర ద్రోహులే అని జగన్‌తో పాటు చంద్రబాబుపై ఆయన ఘాటు విమర్శలు చేసి, టీడీపీ అధినేత పొత్తు ఆహ్వానంపై తమ వైఖరిని కుండబద్దలు కొట్టారు. అలాగు జగన్‌ను సీఎంగా దించేయడం, చంద్రబాబును ఆ సీట్లో కూర్చోపెట్టడం జనసేన లక్ష్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
బొలిశెట్టి నినాదాన్ని జనసేన కార్యకర్తలు అందిపుచ్చుకున్నారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ము, ధైర్యం, ప్రేమ ఉంటే జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ముందుకు రావాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సవాల్ విసురుతున్నారు. ఆ షరతుకు అంగీకరించే మనసుంటే పొత్తు మాట ఎత్తాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనవసరంగా పొత్తు తుట్టెను చంద్రబాబు కదిల్చారా? అనే చర్చకు తెరలేచింది.