మలయాళీ స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టీలపై అపారమైన గౌరవమర్యాదలను చూపిస్తాడు అక్కడి మరో స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్. సినీ కుటుంబం నుంచినే వచ్చినా.. పృథ్వికి వెటరన్లపై అపారమైన గౌరవమర్యాదలు. తను వారి అభిమానిని అంటూ తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా పదే పదే చెప్పుకుంటూ ఉంటాడు.
ఈ క్రమంలో.. తన అభిమాన నటుడు మోహన్ లాల్ ను హీరోగా పెట్టి లూసీఫర్ కు స్వయంగా దర్శకత్వం వహించాడు పృథ్విరాజ్. తనలో మంచి నటుడే కాదు, దర్శకుడు కూడా ఉన్నాడని చాటుకున్నాడు. లూసీఫర్ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు, ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ అవుతూ ఉంది.
ఇక లూసీఫర్ కాంబినేషన్ లో ఆ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉందట. అదలా ఉంటే.. ఇటీవలే ఈ కాంబినేషన్లో మరో సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైంది. బ్రో డాడీ పేరుతో ఈ సారి పృథ్వి కొత్త సినిమాతో వచ్చాడు. ఇందులో కూడా మోహన్ లాల్ తో పాటు పృథ్వి కూడా నటించాడు.
అయితే ఇది లూసీఫర్ తరహాలో యాక్షన్ ఎంటర్ టైనర్ కాదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కొడుకుకు అన్నలా కనిపించే తండ్రి.. ఈ సినిమా టైటిల్ సారాంశం. బ్రదర్ లాంటి డాడీ తన కొడుకు జీవితంలో పెళ్లికి సంబంధించిన కాంప్లికేషన్లను ఎలా డీల్ చేశాడనే తరహా కథాంశం అని ట్రైలర్ ద్వారా స్పష్టత వస్తోంది. మోహన్ లాల్ కు జోడీగా మీనా నటించింది.
ఇలా తండ్రి పాత్రల విషయంలో మోహన్ లాల్ మరో ఎత్తుకు ఎదుగుతున్నాడు నటుడిగా. బాలీవుడ్ లో టాలీవుడ్ లో హీరోలు కుర్ర అమ్మాయిలతో రొమాన్స్ చేసే పాత్రల కోసం తపిస్తూ ఉంటే, మలయాళంలో స్టార్లు హీరోలతో సమానమైన తండ్రి పాత్రల్లో ఇలా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినిమాలపై వరసగా ఒక కన్నేసి ఉంచిన టాలీవుడ్ స్టార్లు.. బ్రో డాడీ ని కూడా ఒక చూపు చూడకుండా వదలుతారా! ఈ సినిమా ఓటీటీ వేదికగానే విడుదల కానుంది.