జనసేనపై తమది వన్ సైడ్ లవ్ అని చెప్పుకుని.. చంద్రబాబు నాయుడు తొందరపడ్డారా! అపర చాణుక్యుడు, గొప్ప వ్యూహకర్త.. అంటూ అనుకూల మీడియా అనునిత్యం చంద్రబాబు గురించి చెబుతూ ఉంటుంది. అయితే చంద్రబాబు వ్యూహాలు చాలా సార్లు పరమ పేలవంగా ఉంటాయి. ఆయన వ్యూహాల్లో ఏవైనా వర్కవుట్ అయ్యేవంటే.. అవి పొత్తు ఎత్తులు మాత్రమే!
ఎప్పుడు ఎవరి తోక పట్టుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు. తోకే కాదు.. అవసరం అయినప్పుడు వారికి సంబంధించి దేన్ని పట్టుకుని అయినా చంద్రబాబు పొత్తులకు ఒప్పించుకుంటాడు. ఇలాంటి పొత్తులతో అధికారానికి చేరువయ్యి.. తను 14 సంవత్సరాల పాటు సీఎంగా చేసినట్టుగా చంద్రబాబు గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు.
తొలి ఐదేళ్లూ చంద్రబాబును ప్రజలు సీఎంగా ఎన్నుకోలేదు. ఎన్టీఆర్ ను ప్రజలు సీఎంగా ఎన్నుకుంటే, ఆయనను దించేసి ఈయన సీఎంగా అయ్యారు. టెక్నికల్ గా పదవి సంపాదించుకుని సీఎంగా చలామణి అయ్యారు.
1999లో బీజేపీ తో పొత్తు చంద్రబాబును ఒడ్డున పడేసింది. అప్పుడు కూడా సొంతంగా గెలవలేదు. ఉమ్మడి ఏపీలో అప్పుడు బీజేపీ బలం చెప్పుకోదగిన స్థాయిలో ఉండింది కూడా. కార్గిల్ విజయం బీజేపీకి ఊపును ఇస్తే.. ఆ ఊపులో చంద్రబాబు బయటపడ్డారు.
ఇక 2014 సంగతి చెప్పనక్కర్లేదు! తలా ఒక చేయి వేస్తే తప్ప చంద్రబాబు ఒకటిన్నర శాతం ఓట్ల అధికంగా సాధించి మళ్లీ సీఎం కాలేకపోయారు. మరి ఇప్పుడు చంద్రబాబుకు మళ్లీ ఇంకోరి సాయం కావాలి. జనసన, బీజేపీ వంటి పార్టీలన్నీ కలిసి వచ్చి మళ్లీ ఆయనను కుర్చీలో కూర్చోబెట్టాలి. అంతే తప్ప సొంతగా గద్దెనెక్కే సీన్ లేదని స్వయంగా చంద్రబాబు క్లారిటీ ఇచ్చుకున్నారు. తను ఇప్పుడు వన్ సైడ్ లవ్ లో ఉన్నట్టుగా స్వయంగా చెప్పుకున్నారు!
మరి ఎన్నికలకు ఇంకా కనీసం రెండేళ్ల సమయం ఉండగానే.. చంద్రబాబు ఇలా చెప్పుకుని.. తన చేతగాని తనాన్ని హైలెట్ చేసుకున్నారు. ప్రత్యర్థులకు ఆయుధాన్ని ఇచ్చారు. మిత్రులకు తన బలహీనతను చాటుకున్నాడు. చంద్రబాబే వన్ సైడ్ లవ్ అంటున్నారు కాబట్టి.. ఒకవేళ ఈ లవ్ కు జనసేన, బీజేపీలు ఒప్పుకున్నా.. షరతులు గట్టిగా ఉండొచ్చు!
వన్ సైడ్ లవ్ అంటున్న ఈ ప్రేమికుడి నుంచి ఆ పార్టీలు భారీ గా సీట్లను డిమాండ్ చేయొచ్చు! తమ వాటాకు ఏ 70, 80 సీట్లో ఇవ్వాలంటూ ఆ పార్టీలు అడిగినా అడగొచ్చు! మరి అప్పుడు ఈ వన్ సైడ్ లవర్ ఏమనగలరు? అసలే తనది లవ్ అయిపోయే! కాబట్టి.. వారు కోరినట్టుగా చేయాల్సి రావొచ్చు. లేదా.. వారు చంద్రబాబును పూర్తిగా లైట్ తీసుకోవచ్చు. అప్పుడు భగ్న ప్రేమికుడిగా చంద్రబాబు మరింత బలహీనం అయిపోవచ్చు.
అసలే సొంతంగా ఏనాడూ గెలిచిన చరిత్రలేని వ్యక్తి, స్వయంగా తనే తన బలహీనతను బయటపెట్టేసుకున్నాడు. పొత్తులు విచ్చుకున్నా, విచ్చుకోకపోయినా.. చంద్రబాబు తన వీక్ పాయింట్ ను స్వయంగా చాటింపు వేసుకున్నారు!