ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాకు సమస్యలు ఇంకా తీరినట్లు లేదు. సెన్సారు సర్టిఫికెట్ వచ్చినా కోర్టు మెట్లు ఎక్కక తప్పలేదు. అక్కడ కిందా మీదా పడి ఆఖరికి ఓ కొలిక్కి తెచ్చుకున్నారు. కానీ సెన్సారు దగ్గర సర్టిఫికెట్ మాత్రం సకాలంలో సంపాదించలేకపోయారు.
సినిమా విడుదల శుక్రవారం అంటే గురువారం సాయంత్రం వరకు ముంబాయి నుంచి రావాల్సిన సర్టిఫికెట్ రాలేదు. దాంతో సినిమాను ఏకంగా వారం రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది.
దీనికి టెక్నికల్ రీజన్స్ అనే ముద్దు పేరు పెట్టారు కానీ అసలు విషయం సెన్సారు సర్టిఫికెట్ రాలేదనే. ముంబాయి నుంచి ఓ పెద్ద అధికారి వచ్చి సినిమా చూసారు. ఓకె అన్నారు. కానీ సర్టిఫికెట్ మాత్రం ముంబాయి వెళ్లి పంపుతామన్నారు. కానీ ఇంతకీ అంతకీ మెయిల్ మాత్రం రాలేదు. చేసేది ఏమీ లేక వాయిదా ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూలు మార్చి 9 నాటికి వచ్చేస్తుందని, ఆ లోపే సినిమా రెండు భాగాలు విడుదల చేయాలని వ్యూహం రచించారు. కానీ ఆ వ్యూహం ఇప్పుడు బెడిసి కొట్టింది. ఒకటి లోగా సర్టిఫికెట్ వచ్చి సినిమా విడుదలయితే ఓకె. లేదూ అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తే ఇక చేసేదేమీ వుండదు. ట్విట్టర్ లో ముక్కలు ముక్కలుగా వదలడం తప్ప.