పంజాబ్ లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా.. అక్కడ సినిమా స్టార్లు, క్రికెటర్లను అడ్డం పెట్టుకుని ఒకటీ రెండు ఎంపీ సీట్లలో అయినా సత్తా చూపించే ప్రయత్నం చేస్తోంది. శిరోమని అకాళీదళ్ తో దోస్తీ చెడిన తర్వాత, కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంటి వాళ్లను తెచ్చుకున్నా బీజేపీకి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఈ పరిణామాలకు తోడు అక్కడి గుర్ దాస్ పూర్ ఎంపీ అయిన సన్నీ డియోల్ కు ఎదురుగాలి వీస్తోందనే వార్తలకు బీజేపీ అధిష్టానం విరుగుడును రెడీ చేసుకుంటోందట.
గత ఎన్నికల్లో గుర్ దాస్ పూర్ నుంచి సన్నీ డియోల్ బీజేపీ ఎంపీగా నెగ్గాడు. అయితే గెలిచిందన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకున్నది లేదట! ఎంపీ హోదా అంటే అదో గౌరవం మాత్రమే అన్నట్టుగా ఉందట ఈ హీరోగారి వ్యవహారం. దానికి తోడు తన సినిమా ఒకటి మంచి హిట్ కావడంతో.. ఇప్పుడు తిరిగి సినిమా కెరీర్ తో బిజీ అయ్యారు.
ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ధర్మేంద్ర తనయుడిని ఎన్నికల బరిలోకి దింపే సాహసం చేయడం లేదట కమలం పార్టీ. అందుకు ప్రత్యామ్నాయంగా టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ ను లైన్లో పెడుతోందని సమాచారం.
సన్నీ స్థానంలో గుర్ దాస్ పూర్ నుంచి యువరాజ్ ను పోటీ చేయించడానికి బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోందని సమాచారం. దీనికి యువరాజ్ నుంచి కూడా సానుకూలత ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. యువీని చేర్చుకుంటే తను బలమైన అభ్యర్థిగా రంగంలో ఉండటంతో పాటు… పంజాబ్, హర్యానాల్లో బీజేపీ ఊపు పెరుగుందని అంచనా వేస్తున్నారట.
ఇప్పటికే ఇందుకు సంబంధించి యువీ తల్లి, బీజేపీ హైకమాండ్ ల మధ్యన చర్చలు జరిగాయని, యువీ మేనేజర్ కూడా దీన్ని సెట్ చేసే పనిలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ధృవీకరించకపోయినా.. యువరాజ్ బీజేపీలో చేరి గురుదాస్ పుర నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతూ ఉంది.