సరైన సినిమా పడాలే కానీ మెగాస్టామినా ఇదీ అని చెబుతున్నట్లు వుంది వాల్తేర్ వీరయ్య సినిమా వ్యవహారం. నైజాంలో 25 కోట్ల మేరకు షేర్ సాధించిన వీరయ్య త్వరలో సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వసూళ్లను దాటే దిశగా వెళ్తోంది. మరో రెండు మూడు కోట్లు సాధిస్తే చాలు వాటిని దాటేసినట్లే. విశాఖలో ఇప్పటికే సర్కారు వారి పాట వసూళ్లను దాటేసింది. విశాఖ ఏరియాలో భీమ్లా నాయక్ ఏడెనిమిది కోట్లు చేయలేదు. వాల్తేర్ వీరయ్య 12 కోట్లు దాటేసింది.
ఈ రెండు సినిమాలతో పోలిక ఎందుకు అంటే భీమ్లా నాయక్ విడుదల టైమ్ లో జరిగిన బ్లాక్ బస్టర్ హడావుడి ఇంతా అంతా కాదు. సర్కారు వారి పాట కూడా సూపర్ హిట్ అనే ప్రచారం. అలాంటిది ఈ రెండు సినిమాలను వాల్తేర్ వీరయ్య సులువుగా దాటేసింది. నైజాం, వైజాగ్ ల్లోనే కాకుండా మిగిలిన ఏరియాల్లో కూడా ఇదే విధమైన ఫిగర్లు కనిపిస్తున్నాయి.
గమ్మత్తేమిటంటే వైజాగ్ ఏరియాలో బాలయ్య సినిమా కూడా రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టుకోవడం. జిఎస్టీ కాకుండానే ఏడు కోట్లు వసూలు చేసింది. అక్కడే వారసుడు రెండు కోట్ల వరకు వసూలు చేసింది. ఫుల్ రన్ అయ్యాక ఫిగర్లు తీస్తే చాలా రికార్డులను వాల్తేర్ వీరయ్య దాటేసే అవకాశం కనిపిస్తోంది.
నిజానికి గొప్ప కథ కాదు. జస్ట్ మెగా ఫ్యాన్స్ ను, కామన్ ప్రేక్షకులను కట్టి పడేయ గల మూవ్ మెంట్స్ ను దర్శకుడు బాబి అందివ్వగలడం. దేవీశ్రీప్రసాద్ మాంచి అడియో సమకూర్చడం. అవే ఈ మ్యాజిక్ కు కారణం అయ్యాయి.