కుప్పంలో ఏదో రకంగా తనను ఓడిస్తారనే భయం చంద్రబాబుకు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతోంది. గతంలో కుప్పాన్ని చంద్రబాబుకు ప్రత్యర్థులు వదిలేశారు. దీంతో కుప్పంలో ఏం జరుగుతున్నదో జనానికి తెలిసేది కాదు. కుప్పంలో చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ప్రస్తుతం కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ దెబ్బతో ప్రతి నెలలకు ఒకసారి కుప్పానికి స్వయంగా చంద్రబాబే పరుగులు పెట్టాల్సిన దుస్థితిని సీఎం జగన్ కల్పించారు.
ఒకప్పుడు కనీసం నామినేషన్ వేయడానికి కూడా చంద్రబాబు వెళ్లేవారు కాదు. బాబు తరపున ఎవరో ఒకరు వెళ్లేవారు. కుప్పంలో భారీ మెజార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదనే భరోసా వుండడంతో చంద్రబాబు ఇష్టానుసారం ప్రవర్తించారు. కానీ తనకు వైఎస్ జగన్ రూపంలో మొండివాడైన బలమైన ప్రత్యర్థి దొరకడంతో బాబుకు దిక్కుతోచడం లేదు. కుప్పంలో బాబు విజయానికి, భారీ ఆధిక్యతకు కారణాలపై జగన్ అధ్యయనం చేయించారు.
కర్నాటకలో స్థిరపడిన కుప్పం వాసుల ఓట్లు సుమారు 60 వేలు ఇప్పటికీ ఆంధ్రాలోనే ఉన్నాయని వైసీపీ గుర్తించింది. చంద్రబాబు విజయ రహస్యం దొంగ ఓట్లలో దాగి వుందని గ్రహించి, వాటిని తొలగించే ప్రక్రియకు ఆ పార్టీ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్రీకారం చుట్టింది. ఆధారాలతో సహా దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో ఐఏఎస్ అధికారి, వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి ఫిర్యాదు చేశారు. ఈయనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సుమారు 28 వేల దొంగ ఓట్లను తొలగించారు. దీంతో చంద్రబాబు మెజార్టీ అమాంతం పడిపోయింది. అది ఎలాగో చూద్దాం.
1983 మొదలుకుని ఇప్పటి వరకూ కుప్పంలో టీడీపీనే గెలుస్తూ వస్తోంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన మొదట్లో రంగస్వామినాయుడు టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 1985లో కూడా ఆయనే విజయం సాధించారు. ఆ తర్వాత 1989 నుంచి చంద్రబాబు ప్రస్థానం మొదలైంది. మొదట ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు బీఆర్ దొరస్వామినాయుడుపై 6,918 ఓట్ల తేడా విజయం సాధించారు. ఐదేళ్లు గడిచే సరికి అంటే.. 1994లో 56,588 ఓట్ల మెజార్టీ రావడం గమనార్హం. ఈ మెజార్టీ ఆ తర్వాత ఎన్నిక వచ్చే సరికి మరింత పెరిగింది. 1999లో 65,687 ఓట్ల మెజార్టీ, 2004లో 59,535 ఓట్ల మెజార్టీ, 2009లో 46,066 ఓట్ల మెజార్టీ, 2014లో 47,121 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2019లో 30,722 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గెలుపొందారు. దొంగ ఓట్లను కట్టడి చేయడంతో చంద్రబాబుకు మెజార్టీ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో కుప్పంలో చంద్రబాబు ఎత్తుల్ని చిత్తు చేసేందుకు వైసీపీ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. దొంగ ఓట్ల రహస్యం బయట పడడం, దాన్ని పూర్తిస్థాయిలో అరికడితే తన పరిస్థితి ఏంటనే భయం చంద్రబాబును వెంటాడుతోంది. ఇంకా 30 వేల పైచిలుకు దొంగ ఓట్లను తొలగించేందుకు వైసీపీ ఆధారాలతో సహా సిద్ధంగా ఉంది. మాయలఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, చంద్రబాబు విజయం దొంగ ఓట్లలో ఉందని వైసీపీ గుర్తించడం వల్లే కుప్పాన్ని టార్గెట్ చేసింది. దొంగ ఓట్లను తొలగించడం ద్వారా కుప్పంలో గెలిచితీరుతామని జగన్ ధీమాతో ఉన్నారు. ఆ ధీమానే చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది.