టీడీపీ ఇన్‌చార్జ్ అంటే టికెట్ ఖాయం కాదా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ నేతలే చెబుతున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు పార్టీలో సమూల ప్రక్షాళన చేస్తారని, ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలనే ఎన్నికల బరిలో నిలుపుతారనే వారు అంటున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్‌లు తమకే టికెట్ అని సంబరపడొద్దని అభిప్రాయపడుతున్నారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారని, మొహమాటానికి పోయి నష్టపోవడానికి ఆయన సిద్ధంగా లేరని టీడీపీ నేతలు చెప్పడం విశేషం.
ఈ నేపథ్యంలో 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న నేతలు తమకే వచ్చే ఎన్నికల్లో టికెట్ అని ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశమైంది. దీంతో టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేతలు ఆ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. గతంలో ఓడిపోయిన తర్వాత ఎవరో ఒకరు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్‌చార్జ్‌లుగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పలు సర్వేల నివేదికలను పరిశీలించిన తర్వాతే ఎవరికి టికెట్ ఇవ్వాలో చంద్రబాబు, లోకేశ్ నిర్ణయం తీసుకుంటారని పార్టీలో చర్చ జరుగుతోంది. అంత వరకూ ఉన్న వాళ్లతోనే నెట్టుకొస్తారని చెబుతున్నారు. అంత మాత్రాన తమకే టికెట్ ఖరారైందని, ఏవేవో ఊహించుకుని చివరికి నిరాశ చెందొద్దని హితవు చెప్పడం గమనార్హం. మరికొన్ని చోట్ల జనసేనకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుండడంతో టీడీపీ నేతలు మౌనం పాటిస్తున్నారు. అనవసరంగా పార్టీ కోసం తామెందుకు ఖర్చు పెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీలో గందరగోళానికి తక్కువేం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీ తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.