బాలకృష్ణ-పవన్ కల్యాణ్ చిట్ చాట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమంపై భారీ అంచనాలున్నాయి. పవన్, ఈ ఇంటర్వ్యూకు హాజరైనప్పుడే భారీస్థాయిలో ట్రెండింగ్ నడిచింది. అలా మోస్ట్ ఎవెయిటెడ్ గా మారిన ఈ కార్యక్రమానికి సంబంధించి టీజర్ రిలీజైంది. చాలా పేలవంగా, అంచనాల్ని ఏమాత్రం సెట్ చేయలేని విధంగా ఉంది ఆ టీజర్.
ఆమధ్య ప్రభాస్ ఎపిసోడ్ ను ప్రసారం చేసేముందు ఇలానే టీజర్ రిలీజ్ చేశారు. ఆ ఒక్క టీజర్ తో ఎపిసోడ్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో స్ట్రీమింగ్ మొదటి రోజున ఏకంగా సర్వర్ క్రాష్ అయింది. అలాంటి అంచనాల్ని సెట్ చేయడంలో పవన్-బాలయ్య ఎపిసోడ్ టీజర్ ఫెయిలైంది.
కంటెంట్ విషయానికొస్తే, కర్టెన్ రైజర్ టైమ్ లోనే రిలీజ్ చేసిన షాట్స్ ను టీజర్ లో కూడా రిపీట్ చేశారు.ఇక సాధారణ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలకు ఎలాంటి టీజర్లు కట్ చేస్తారో, అంతకంటే తక్కువస్థాయిలోనే ఈ టీజర్ కటింగ్ ఉంది. మామూలు ఇంటర్వ్యూ టీజర్లు ఇంతకంటే బాగుంటాయి.
అందర్నీ అడిగినట్టుగానే తనను బాల అని పిలవమని బాలకృష్ణ పవన్ ను కోరతాడు. ఇక గతాన్ని గుర్తుచేసుకుంటూ తన వదినకు కాల్ చేసి సినిమాలు మానేస్తానంటూ పవన్ చెబుతాడు. ఈ రెండూ రొటీన్ విషయాలే. చిరంజీవి నుంచి నేర్చుకున్నవేంటి, వద్దనుకున్నవేంటి అనే బాలయ్య ప్రశ్న కూడా రొటీనే.
ఉన్నంతలో టీజర్ లో ఆసక్తి రేకెత్తించిన అంశం ఏదైనా ఉందంటే.. రాష్ట్రంలో అభిమానుల ప్రేమ, ఓటు బ్యాంకుగా ఎందుకు కన్వర్ట్ అవ్వలేదంటూ బాలయ్య అడగడమే. ఒక విధంగా చెప్పాలంటే, ఇది కూడా రొటీన్ క్వశ్చన్ అయినప్పటికీ, బాలకృష్ణ నోటి నుంచి రావడం కూసింత ఆసక్తి రేకెత్తించింది. ఇది తప్పిస్తే, మిగతాదంతా రొటీన్ స్టఫ్.