ఈనెల 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటిదాకా పోలీసుల నుంచి అనుమతులు రాలేదు. పోలీసులు అనుమతి ఇచ్చిన ఇవ్వకపోయినా పాదయాత్ర చేసి తీరుతాం అని తెలుగుదేశం పార్టీ నాయకులు గంభీరంగా పలుకుతున్నారు. కానీ, అటు డీజీపీ గురించి గానీ జిల్లా ఎస్పీ నుంచి గానీ అనుమతుల పరంగా స్పందన లేదు. ఈ నేపథ్యంలో అనుమతి వస్తుందా లేదా అనే విషయమే డోలాయమానంగా ఉన్న పరిస్థితుల్లో, నారా లోకేష్ మాత్రం మహదానంద పడిపోతున్నట్టుగా తెలుస్తోంది. పాదయాత్ర చేయడం కంటే ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకుంటేనే మేలని తనను నియంత్రిస్తే చాలని ఆయన వేచి చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పాదయాత్ర చేసినా, మరొకరు బస్సు యాత్ర చేసినా అంతిమంగా తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నది జగన్ సర్కారు మీద బురద చల్లడం మాత్రమే. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు ఇప్పుడు నారా లోకేష్ ప్లాన్ చేస్తున్న పాదయాత్రకు మౌలికంగా వారి భావజాలం లోనే ఒక వ్యత్యాసం ఉంది. ప్రజలతో సంపూర్ణంగా మమేకమైపోయి వారి కష్టనష్టాలను తెలుసుకొని తాను ముఖ్యమంత్రి అయితే వారికోసం ఏం చేయగలనో అర్థం చేసుకోవడానికి ఆనాడు జగన్ పాదయాత్ర నిర్వహించారు.
కానీ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ఉద్దేశం వేరు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి పదవిని చివరిసారిగా చేపట్టాలని ఉబలాటపడిపోతున్న ఆయన తండ్రి చంద్రబాబునాయుడుకు పాదయాత్రలో నడిచేంత శక్తిగానీ, ప్రజల సమస్యలను స్వయంగా విని తెలుసుకునే ఓపికగానీ లేవు. మధ్యలో పాదయాత్ర అనే డ్రామాను తాను నడిపించడానికి లోకేష్ పూనుకున్నారే తప్ప.. దీని వెనుక మరొక మర్మం లేదు.
లోకేష్ వ్యవహార సరళికి పాదయాత్ర నప్పే వ్యవహారం కూడా కాదు. ప్రకటనల రూపంలో అయితే.. చాలా ఘనంగా జగన్ పాదయాత్రకంటె పెద్దదిగా నాలుగువేల కిలోమీటర్ల పొడవున నడుస్తానంటూ ప్రకటించారు. కానీ ఆచరణలో ఆమేరకు నడుస్తారో లేదో తెలియదు. నడవాలనే కోరిక కూడా లేదు. పాదయాత్ర చేయడం కంటె ప్రభుత్వం మీద బురద చల్లడమే ప్రధానమైన కోరిక.
ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోతే.. బహుశా లోకేష్ కంటె సంతోషించే వాళ్లు మరొకరు ఉండరని పార్టీ నాయకులే గుసగుసలు పోతున్నారు. ఎందుకంటే.. నడిచే కష్టం తప్పుతుంది. అలాగని ప్రభుత్వం మీద తమకు కావాల్సినంత బురద చల్లడానికి కూడా బోలెడంత చాన్సుంటుంది. నన్ను చూసి జగన్ భయపడిపోయాడు అని గప్పాలు కొట్టుకోడానికి కూడా ఉంటుంది. అలా లోకేష్ అనుమతుల నిరాకరణ కోసం ఎదురుచూస్తున్నట్టుగా అనిపిస్తోంది.