ప్రధాని నరేంద్రమోడీ రాజకీయంగా తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి బ్రహ్మస్త్రాన్ని ఒకటి సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి.. ముస్లిం మతస్తుల్లో కూడా భాజపాకు ఆదరణ పెంచడానికి ఆయన ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశారు. పస్మాందా ముస్లిములను తమ పార్టీవైపు ఆకర్షించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన పార్టీ వ్యూహకర్తలకు, శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది. పస్మాందా ముస్లిములు అంటే.. ఆ మతం వెనుకబడిన వర్గాలు, పేదలు! ఒక రకంగా చెప్పాలంటే ముస్లిముల్లో బీసీలు, ఎస్సీలు లాంటి వాళ్లు. వీళ్ల మీద ఫోకస్ పెడితే పార్టీకి విస్తృతప్రయోజనం ఉంటుందనేది మోడీ అంచనా.
ముస్లింలు అనే వర్గానికి మొత్తంగా మైనారిటీ కోటా కింద ప్రస్తుతం రిజర్వేషన్లు గానీ ఇతర సదుపాయాలు గానీ దక్కుతున్నాయి. కానీ ముస్లింలోనూ వర్గాల విభజన ఉంది. ఆ వర్గీకరణ ప్రకారం వెనుకబడిన వారే పస్మాందాలు. నిజానికి ‘మైనారిటీ కోటా’ పేరిట ప్రభుత్వం కల్పించే సదుపాయాలు అన్నీ సంపన్న ముస్లిం కుటుంబాలు, వర్గాలే కాజేస్తున్నాయని.. ముస్లిముల్లో పేదలు, వెనుకబడిన వర్గాల వారు ఎప్పటికీ వెనుకబడే ఉంటున్నారని చాలా కాలంగా ఒక చర్చ ఉంది. ఇప్పుడు పస్మాందా ముస్లింలను ఆదరించే పేరిట భాజపాచేస్తున్న వ్యూహరచనకు ఆ వర్గీకరణ ఒక ప్రేరణ.
ముస్లిం మతంలో సంపన్నుల పట్ల అసంతృప్తితో ఉండే పస్మాందా వెనుకబడిన తరగతుల వారిని దగ్గరకు చేర్చుకోవాలని బిజెపి అనుకుంటోంది. మైనారిటీ కోట లబ్ధిని వారికి నష్టం జరగకుండా అందించేలా చట్టాలు మార్చాలని యోచిస్తోంది. అంటే ముస్లిం మతంలోనూ వర్గీకరణను తెచ్చే ఆలోచన ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడిక ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు, లబ్ధి పొందడంలో ఏబీసీడీ క్లాసిఫికేషన్లు వస్తాయి. నిజానికి ముస్లింలలో ఏబీసీడీలుంటే.. కొన్ని తరగతులకు బాగా మంచి జరుగుతుంది. వారందరూ కూడా మోడీ సర్కారును నెత్తినపెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదు.
సాధారణంగా ముస్లింలలో అష్రఫ్, అజ్లఫ్, అర్జల్ అనే తరగతులు ఉంటాయి. అష్రఫ్ అంటే సంపన్న ముస్లింలు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలన్నీ వీళ్లే పొందుతున్నారనేది ఆరోపణ. అజ్లఫ్ అంటే వృత్తిపనులు వెనుకబడిన తరగతుల కింద పరిగణించవచ్చు. అర్జల్ వర్గం అంటే ముస్లిముల్లో అంటరాని వారుగా పరిగణిస్తున్నారు. ఈ మూడు తరగతుల్లో అజ్లఫ్, అర్జల్ తరగతులకు మేలు జరిగేలా కొత్త చట్టాలు తెస్తే.. ముస్లిం సమాజం బిజెపికి చేరువ అవుతుందనే వ్యూహ రచనలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎలాంటి నిర్ణయాలు వస్తాయో, పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి.