పవన్ కల్యాణ్ లాంటి పెద్ద హీరో సినిమా చేస్తానంటే దర్శకులు క్యూ కడతారు. అలా కట్టారు కూడా. తనకున్న ప్రాధామ్యాల్ని అనుసరించి పవన్.. అటు దర్శకులకు ఇటు నిర్మాతలకు అవకాశాలిస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం పవన్ తో సినిమా చేసేందుకు దర్శకులు దొరకడం లేదంట. స్వయంగా బండ్ల గణేశ్ చెబుతున్న మాటలివి.
బండ్లకు మరో సినిమా చేసి పెడతానని పవన్ హామీ ఇచ్చాడు. ఆ విషయాన్ని బండ్ల బయటకు చెప్పారు. అప్పట్నుంచి దర్శకుడి వేటలో ఉన్న తనకు సరైన దర్శకుడు, మంచి స్టోరీలైన్ దొరకడం లేదని చెబుతున్నాడు ఈ నిర్మాత.
రీసెంట్ గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి రమేష్ వర్మ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం రవితేజతో ఖిలాడీ సినిమా చేస్తున్న రమేష్ వర్మ, త్వరలోనే బండ్ల గణేశ్ నిర్మాతగా, పవన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడంటూ పుకార్లు వచ్చాయి. వాటిని బండ్ల ఖండించాడు.
పవన్ తో సినిమా చేయడానికి తనకు సరైన దర్శకుడు దొరకడం లేదంటున్నాడు ఈ నిర్మాత. మరోవైపు తన సినిమా ప్లాన్స్ కు, భవిష్యత్ కార్యాచరణకు పవన్ సినిమా చిన్న అడ్డంకిగా మారిందనే విషయాన్ని కూడా పరోక్షంగా చెప్పుకొచ్చాడు. పవన్ తో సినిమా పూర్తయితే తప్ప, తను అనుకున్న మిగతా ప్రాజెక్టుల్ని పట్టాలపైకి తీసుకురాలేకపోతున్నానని అన్నాడు.
గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా నిర్మించాడు బండ్ల. అంతకంటే ముందు పవన్ తో తీన్ మార్ అనే సినిమా తీశాడు. మళ్లీ ఇన్నేళ్లకు పవన్ తో సినిమా నిర్మించే అవకాశం అందుకున్నాడు ఈ నిర్మాత.