శాండల్‌వుడ్‌ను డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. సహజంగా డ్రగ్స్ వ్యవహారంపై ఆరోపణలు, విచారణలు తూతూ మంత్రంగా సాగడం చూశాం. కర్నాటకలోనూ అదే విధంగా జరుగుతుందని అంతా భావించారు. కానీ కన్నడ చిత్ర పరిశ్రమకు పట్టిన మత్తు పోయేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు….ఇంత వరకూ సాగిన విచారణ చెబుతోంది.
ఇప్పటికే పలువురు కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన నటీనటుల్ని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగా మరికొన్ని అరెస్టులు తప్పేలా లేవు. ఇప్పటికే నటి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటి సంజన అరెస్టు కూడా తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సంజన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో శాండల్‌వుడ్‌లో మరింత కలకలం రేపుతోంది.
ఈవెంట్ మేనేజర్ ప్రీతమ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరులోని ఇందిరా నగర్‌లో ఉన్న సంజన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహి స్తున్నారు. ఈ సోదాల్లో సంజన ఇంట్లో దొరికే ఆధారాలను బట్టి ఆమె అరెస్టు ఉంటుంది. కీలక ఆధారాలు దొరికితే మాత్రం సంజన అరెస్టు ఖాయమని సీసీబీ పోలీసులు చెబుతున్నారు. సంజన ద్వారా ఎవరెవరు డ్రగ్స్ ఉచ్చులో ఇరుక్కున్నారనే విషయం తేలాల్సి ఉంది.
శాండల్‌వుడ్‌లో తీగ లాగితే డొంక కదిలినట్టు…డ్రగ్స్ వ్యవహారంలో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. చివరికి డ్రగ్స్ కేసు కన్నడ చిత్ర పరిశ్రమను ఏం చేయనుందో?