ఆమె సెలబ్రిటీ అయినా…మహిళ కావడంతో కుటుంబ సభ్యుల నిఘా తప్పలేదు. బహుశా పురుషాధిపత్య సమాజం కావడంతో ఆ అందాల తారకు చిన్నప్పటి నుంచి తాను కోరుకున్న స్వేచ్ఛ దక్కలేదు. ఎక్కడో ఆమెను ఆ గిల్టీ వెంటాడుతూ ఉంది. సహజంగా సినీ పరిశ్రమలో హీరోయిన్లపై గాసిప్‌లు రావడం సాధారణ విషయమే. కానీ ఢిల్లీ భామ రకుల్ ప్రీత్‌సింగ్‌పై ఇంత వరకూ అలాంటివేవీ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ అడుగు పెట్టింది. కామెడీగా సాగిన ఆ సినిమా ప్రేక్షక ఆదరణ పొందింది. దీంతో రకుల్ ప్రీత్‌సింగ్‌కు కూడా గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో పలువురు అగ్ర హీరోల సరసన నటించింది. తమిళం, హిందీ సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుని బాలీవుడ్ దృష్టి ఆకర్షించింది.
అయినప్పటికీ ఆమెకు ఫలానా హీరోతో డేటింగ్ చేస్తోందనే కనీస గాసిప్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే గాసిప్‌లు రావడం సర్వసాధారణమైన రంగంలో ఆమె ఉన్నారు కాబట్టి. దీనిపై రకుల్‌ను ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.
`నేను ఇప్పటివరకు సింగిల్‌గానే ఉన్నాను. నేను అబ్బాయిలకు దూరంగా ఉండడానికి ఒక రకంగా నా తమ్ముడు అమన్ కారణం. చిన్నప్పటి నుంచి వాడు నన్ను గూఢాచారిలా ఫాలో అయ్యేవాడు. అంటే నిఘా పెట్టేవాడు. స్కూల్‌లో ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడితే వెంటనే ఇంట్లో చెప్పేవాడు. దాంతో అవసరమున్నా సరే అబ్బాయిలతో మాట్లాడేదాన్ని కాదు. అలా చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు దూరంగా ఉండడం అలవాటైపోయింద`ని రకుల్ తెలిపింది.
ఇంకేముంది, మొక్కై వంగనిది మానై వంగునా అనే సామెత చందానా…చిన్నప్పటి నుంచి మగపిల్లలతో మాట్లాడకూదనే భావజాలంతో పెరిగిన అమ్మాయి…పెద్దైన తర్వాత మాత్రం ఏం మాట్లాడుతుంది? ఎలా మాట్లాడుతుంది? రకుల్‌కు చిన్నప్పటి నుంచి ఎదురైన పరిస్థితులపై జాలి పడడం తప్ప ఎవరేం చేయగలరు?