ప్రస్తుతం హీరోయిన్లకు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్ హీరోయిన్లు, ఫేడవుట్ భామలు అనే తేడా లేకుండా అంతా మూకుమ్మడిగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది ఆ జోరు ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది.
రకుల్ ప్రీత్ నుంచి మొదలు పెడితే, నిన్నటి అపర్ణ దాస్ వరకు ఈ 3 నెలల్లోనే దాదాపు ఏడుగురు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. అదితిరావు, తమన్న, వరలక్ష్మి లాంటి హీరోయిన్లు త్వరలోనే పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ ఎంటర్ అయ్యేలా ఉంది.
ముద్దుగుమ్మ మేఘా ఆకాష్ పెళ్లికి సిద్ధమయ్యేలా కనిపిస్తోంది. ఈమధ్య తరచుగా చీరకట్టులో కనిపిస్తోంది. చేతికి మెహందీ కూడా పెట్టుకుంది. ఇదంతా రొటీన్ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఆమె ‘వెడ్డింగ్ వైబ్స్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా వాడుతోంది.
అయితే నిజంగానే ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోందా లేక ఏదైనా యాడ్ కోసం చేస్తున్న హంగామానా అనేది తేలాల్సి ఉంది.
మేఘా ఆకాష్ పై పెళ్లి పుకార్లు ఇప్పటివి కావు. ఎప్పటికప్పుడు ఆమె పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఏడాది కిందట ఆమె పెళ్లిపై కథనాలు వచ్చాయి. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ పొలిటీషియన్ కొడుకుతో మేఘా ఆకాష్ పెళ్లి జరుగుతుందనేది ఆ ప్రచారం.
సదరు పొలిటీషియన్ కుటుంబం, మేఘా ఆకాష్ కుటుంబం చాన్నాళ్లుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్నారట. ఇప్పుడా స్నేహాన్ని చుట్టరికంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యారట. అయితే దీనిపై ఆ కుటుంబం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి మేఘా పెళ్లిపై పుకార్లు మొదలయ్యాయి.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసిన మేఘా ఆకాష్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అవ్వలేకపోయింది. చివరికి రావణాసుర సినిమాలో చేసిన నెగెటివ్ క్యారెక్టర్ కూడా ఆమెకు కలిసిరాలేదు. ఈ గ్యాప్ లో ఆమె నిర్మాతగా కూడా మారింది. ఇక ఈ ముద్దుగుమ్మకు పెళ్లి ఒక్కటే బ్యాలెన్స్.