అదేంటో గానీ సినిమా టైటిల్‌కు ఉన్న క్రేజో లేక కథకున్న బలమో…మొత్తానికి ‘3 ఇడియట్స్’ అత్యంత ప్రజాదరణ పొందుతోంది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ థియేటర్లు మూసివేశారు. యావత్ ప్రపంచమంతా ఇదే పరిస్థితి. దీంతో ఇంటికే పరిమితమైన జనం పొద్దు గడవడానికి ఎంటర్టైన్మెంట్ను వెతుక్కుంటున్నారు.
వినోదం అంటే మొదట గుర్తుకొచ్చేది సినిమానే. ఇందులో రెండో అభిప్రాయానికి తావులేదు. అంతెందుకు తెలుగు చానళ్లను తీసుకుంటే వార్తా చానళ్ల కంటే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకే రేటింగ్స్ ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.
లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇంటర్నెట్ వాడకం కూడా పెరిగింది. ఇంట్లో ఖాళీగా ఉండలేక సెల్లో ఏదో ఒక వినోదాత్మక చిత్రాన్నో, కామెడీ షోలనో వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అమెరికాలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఈ దేశంలో ఇంటికి పరిమితమైన జనం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఏం వీక్షిస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే ఉంటుంది.
లాక్డౌన్ సమయంలో వ్యూయర్స్ ఎక్కువగా చూసిన భారతీయ సినిమాగా ‘3 ఇడియట్స్’ అగ్రస్థానంలో నిలబడటం విశేషం. రాజ్‌కుమార్ హిరాణీ దర్వకత్వంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి, కరీనా కపూర్, బొమన్ ఇరానీ ముఖ్య నటులతో తెరకెక్కిన ఈ చిత్రం 2009లో విడుదలైంది. పదేళ్ల తర్వాత కూడా ఈ చిత్రాన్ని గుర్తు పెట్టుకుని చూస్తున్నారంటే…ఎంతగా భారతీయుల మనసును కొల్లగొట్టిందో అర్థం చేసుకోవచ్చు. 3 ఇడియట్స్’కు ఎక్కువ వ్యూయర్స్
‘‘పదేళ్ల తర్వాత కూడా మా సినిమాకు మంచి ఆదరణ దక్కుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు హిరాణీ ఆనందం వ్యక్తం చేశాడు. ఎంతైనా సినిమా ఇచ్చే కిక్కే వేరబ్బా.