ఆస్కార్ చరిత్రలో సరికొత్త చరిత్రను సృష్టించిన సినిమా 'పారసైట్'. తొలిసారి ఇంగ్లిష్ లో కాకుండా మరో భాషలో రూపొందిన సినిమాను యేటిమేటి సినిమాగా ఆస్కార్ అవార్డ్స్ కమిటీ ప్రకటించింది. 2019 ఆస్కార్ అవార్డ్స్ ప్రకటనలో దక్షిణ కొరియా సినిమా పారసైట్ ఆ ఘనతను సొంతం చేసుకుంది. హాలీవుడ్ సంబంధిత వ్యక్తులతో కాకుండా, ఇంగ్లిష్ లో కాకుండా మరో భాషలో రూపొందిన సినిమాకు తొలి సారి బెస్ట్ పిక్చర్ గా ఆస్కార్ అవార్డును ఇచ్చారు. 92యేళ్ల ఆస్కార్ అవార్డుల చరిత్రలో ఇదే తొలి సారి. అయితే ఇది వరకూ ఫ్రెంచ్ సినిమా 'ది ఆర్టిస్ట్'కు ఈ తరహాలో ఆస్కార్ దక్కింది. 2011లో వచ్చిన ఆ ఫ్రెంచ్ సినిమా కాస్త ప్రత్యేకం.
అది దాదాపుగా మూకీ. అది కూడా హాలీవుడ్ పరిస్థితులపై రూపొందించిన సినిమా అది. మూకీల యుగం ముగిసి, హాలీవుడ్ టాకీల వైపు మరిలిన తరుణంలో ఒక మూకీ సూపర్ స్టార్ ఎదుర్కొన్న పరిస్థితులను ఉద్దేశించి ఆ సినిమాను రూపొందించారు. దాన్ని ఫ్రెంచ్ వాళ్లు రూపొందించారు. అది మూకీ కావడంతో అది భాషాతీతం. ఆ సినిమాకు అప్పట్లో ఆస్కార్ అవార్డుల పంట పండింది. పారసైట్ దానికి భిన్నం. ఈ సినిమా ఆసాంతం కొరియన్ లాంగ్వేజ్ లో సాగుతుంది. పూర్తిగా సౌత్ కొరియన్ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే చాలా మంది పారసైట్ సినిమాను చూసి ఉండొచ్చు. అమెజాన్ లో అందుబాటులో ఉందది. ఇంకా చూడాలనే ఆసక్తిని కలిగిన వాళ్లు ఈ ఆర్టికల్ ను ఇంతటితో ఆపేయడం మంచిది. ఆ సినిమా స్టోరీ ఏమిటనేది ఇక్కడ ప్రస్తావిస్తున్నా.
పారసైట్ సినిమా స్టోరీ ఏమిటనేది తెలుసుకునే ముందు అసలు దక్షిణ కొరియా పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలి. తూర్పు ఆసియాలో ఒక చిన్న దేశం సౌత్ కొరియా. ఎంత చిన్నది అంటే.. తెలంగాణ విస్తీర్ణం అంత ఉంటుందేమో! అయితే ఆ దేశ ప్రగతి మాత్రం అపారమైనది. గత నాలుగైదు దశాబ్దాల్లోనే ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా ఎదిగింది సౌత్ కొరియా. దశాబ్దాల పాటు ఈ దేశం జపాన్ ఎంపైర్ లో భాగంగా ఉండిపోయింది. జపాన్ కు కాస్త ఆనుకుని ఉంటుంది సౌత్ కొరియా. నార్త్ కొరియా-సౌత్ కొరియా కలిసి చాలా కాలం పాటు జపాన్ రాజుల పాలనలో మగ్గాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ప్రాభవం తగ్గిపోవడంతో కొరియా దేశాలకు విముక్తి లభించింది.
భౌగోళికంగా నార్త్ కొరియా-సౌత్ కొరియా ఒక ద్వీపం. అయితే నార్త్ భాగం వేరైంది. అది చైనా అండదండలు కలిగిన నియంతల పాలైంది. ఇప్పటికీ నార్త్ కొరియాలో నియంతృత్వం కొనసాగుతూ ఉంది. సౌత్ భాగం మాత్రం ప్రజాస్వామ్య దేశంగా అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ఉంది. ప్రపంచంలో ఇప్పుడు 12వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ సౌత్ కొరియా. ఆ దేశ విస్తీర్ణం చాలా చిన్నది. కానీ దాని ప్రగతి మాత్రం ప్రపంచంలోని చాలా దేశాల తలదన్నేలా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్ రంగాల్లో సౌత్ కొరియా ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్ ను కలిగి ఉంది. మన దగ్గర కార్ల కంపెనీలు ఏర్పరచాలన్నా అది సౌత్ కొరియన్లకే సాధ్యం. ఇక ప్రస్తుత కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసిన దేశంగా కూడా సౌత్ కొరియా ముందు నిలుస్తూ ఉంది. అంత గొప్ప ప్రగతిని సాధించిన దేశం దక్షిణ కొరియా. ఇది నాణెనికి ఒక వైపు. పారసైట్ సినిమా మరో వైపు!
అదే సౌత్ కొరియాలో పూటగడవడానికి ఇబ్బంది పడే ఒక కుటుంబం కథ 'పారసైట్'. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు. తల్లీ,తండ్రి, కూతురు, కొడుకు. ఎవరికీ సరైన ఉపాధి లేదు. పిజ్జాలను ప్యాక్ చేసే బాక్సులను తయారు చేస్తూ ఉంటారు. ఆ బాక్సులు సరిగా లేవని 25 శాతం వాటికి డబ్బులు ఇచ్చేది లేదని తయారు చేయించుకునే వాళ్లు షాకిస్తారు. ఆ కుటుంబం నివాసం ఉండేది ఒక స్లమ్ లో. వర్షం వస్తే వారి జీవితం నరకప్రాయం. లోతట్టు ప్రాంతంలో ఉండే ఆ స్లమ్ లోకి నీళ్లు వస్తాయి. అంత దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కుటుంబమే గాక, అనేక కుటుంబాలు బతుకీడుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కథలో..హీరోకి ఒక ట్యూషన్ చెప్పే ఉద్యోగం వస్తుంది. ఒక ధనికుల ఇంట్లో వాళ్ల పాపకు ట్యూషన్ చెప్పే బాధ్యత అది. నిజానికి హీరో పెద్దగా చదువుకుని ఉండడు. ఫేక్ సర్టిఫికెట్స్ చూపించి ఆ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. వాళ్లింటికే వెళ్లి వాళ్ల పాపకు చదువు చెబుతుంటాడు. ఆ క్రమంలో తన సోదరిని ఒక ఆర్ట్ సైకాలజిస్టుగా పరిచయం చేస్తాడు. తన సోదరిగా కాకుండా, తన ఫ్రెండ్ అని వాళ్లకు పరిచయం చేస్తాడు. ఆ ఇంట్లో చిన్న పిల్లాడు ఇంట్లోనే దెయ్యాన్ని చూసినట్టుగా తల్లిదండ్రులకు చెప్పి ఉంటాడు. ఆర్ట్ థెరపీ ద్వారా మానసిక భయాన్ని పోగొట్టడానికి అంటూ తన సోదరిని-ఫ్రెండ్ గా ఆ ఇంట్లో పనికి కుదురుస్తాడు.
ఆ ఇంట్లో డ్రైవర్ గా తమ తండ్రిని, ఇంట్లో వంటపనికి తన తల్లిని వారు కుదురుస్తారు. తామంతా ఒకే కుటుంబం అని చెబితే పని ఇవ్వరని, తమకు తెలిసిన వారంటూ ఒకర్నొకరు పరిచయం చేసుకుంటూ వాళ్లు ఆ ఇంట్లో సెటిలవుతారు. అంతవరకూ ఉపాధి లేకుండా ఇబ్బందులు పడిన వాళ్లు ఆ ధనిక కుటుంబం ఇచ్చే పెద్ద జీతాలతో ఆనంద పడతారు. తమ జీవితాలు ఒక కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తారు. ఆ ధనిక కుటుంబం కూడా వీరి సేవలతో ఆనందిస్తూ ఉంటుంది.
అంతా కుదురుకుంటున్న ఆ దశలో.. వీళ్లకు పని ఇచ్చిన ధనిక కుటుంబం తమ పిల్లాడి బర్త్ డే షాపింగ్ కు అని పక్కూరికి వెళ్తుంది. రాత్రికి ఇంటికి రామని చెబుతుంది. ఆ సమయంలో ఈ నలుగురూ ఇంట్లోనే మందు తాగుతూ, విందు భోజనం తింటూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో పాత పనిమనిషి తలుపు కొడుతుంది. ఆ పనిమనిషిని వీళ్లే తెలివిగా ఇంటి నుంచి బయటకు పంపి ఉంటారు. తనను యజమాని అర్జెంటుగా పంపించేసిందని, ఇంట్లో తను దాచుకున్నది ఒకటి అక్కడే ఉండిపోయిందని.. తీసుకెళ్తానంటూ పాత పనిమనిషి ఇంట్లోకి ఎంటరవుతుంది.
అక్కడ నుంచి ఒక్కో ట్విస్టు బయటపడతాయి. పాత పనిమనిషి భర్త అప్పులు ఎక్కువై దివాళా తీసి ఉంటాడు. అతడిని ఈ ధనికుడి ఇంట్లోని ఒక అండర్ గ్రౌండ్ హౌస్ లో దాచి ఉంటుంది ఆమె. సౌత్ కొరియాకు పక్కలో బల్లెంలా నార్త్ కొరియా ఉంటుంది కదా, దాన్నుంచి ఎప్పుడైనా యుద్ధ భయం పొంచి ఉంది ఆ దేశానికి. అందుకే సౌత్ కొరియన్ ధనికులు తమ ఇళ్లల్లో అండర్ గ్రౌండ్ చాంబర్లు కట్టించుకుంటారట. అలాంటి చాంబర్లో తన భర్తను దాచి ఉంటుంది పాత పనిమనిషి. అర్ధరాత్రుల్లో అతడికి భోజనం ఇస్తూ, సంవత్సరాల తరబడి అతడిని పోషించుకుంటూ ఉంటుంది. ఆ ఇళ్లు అంతకు ముందు వేరే వాళ్ల చేతుల్లో ఉన్నప్పటి నుంచి భర్తను అక్కడే పెట్టి ఉంటుందామె. యజమానులు మారుతుంటారు, అండర్ గ్రౌండ్ విషయం వారికి తెలీదు.
అక్కడ తెలివిగా సెటిలైన వీళ్లంతా ఒకే కుటుంబీకులు అని పాత పనిమషికి అర్థమైపోతుంది. తన భర్తను అండర్ గ్రౌండ్ లో ఉంచి పోషించాలని వీరిని ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటారు. పాత పనిమనిషి చనిపోతుంది. ఆమె భర్తను అండర్ గ్రౌండ్ లోనే కట్టేస్తుంది హీరో కుటుంబం. అంతలోనే యాజమాని కుటుంబం అర్ధరాత్రే వెనక్కు వచ్చేస్తుంది. ఆ రాత్రికి ఇంట్లోనే నక్కి నక్కి ఎలాగో బయటపడతారు.
మరుసటి రోజు పిల్లాడి బర్త్ డే. తమ గుట్టు బయటపడుతుందని ఈ కుటుంబం భయంభయంగా ఉంటుంది. ఇంటి బయట పార్టీ జరుగుతూ ఉండగా హీరో అండర్ గ్రౌండ్ లోకి వెళతాడు. కట్టేసి ఉంచిన పాత పనిమనిషి భర్త తప్పించుకుని హీరోపై దాడి చేస్తాడు. తలపై బలంగా కొట్టడంతో హీరో అక్కడే పడిపోతాడు. అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి.. పార్టీ వైపు వెళ్లి.. హీరో సోదరిని పొడుస్తాడు పాత పనిమనిషి భర్త. కూతురును రక్షించుకునే క్రమంలో హీరో తండ్రి పనిమనిషి భర్తను పొడుస్తాడు. ఆ వెంటనే యజమానినీ పొడిచి చంపేస్తాడు!
తమకు ఉపాధిని ఇచ్చిన యజమానిని పొడిచి చంపడమే క్లైమాక్స్ ట్విస్ట్. ఎందుకు చంపాడు? అనేది అనేది ప్రేక్షకుడి జడ్జిమెంట్ కు వదిలేశాడు దర్శకుడు. ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే సినిమాను డీప్ గా చూడాలి! మనసుతో చూడాలి!
సౌత్ కొరియన్ సొసైటీలో పేదవాళ్లను చూసే దృష్టి ఎలా ఉంటుందనే అంశానికి సమాధానమే యజమాని హత్య. అతడిని హత్య చేసిన తర్వాత హీరో తండ్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న చాంబర్ లోకి వెళ్లిపోయి దాక్కుంటాడు. అతడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలీదు. చివరకు ఎలాగో హీరోకి తెలుస్తుంది. ఇల్లు వేరే యజమానుల చేతికి వెళ్లిపోయి ఉంటుంది. తన తండ్రిని రక్షించుకోవాలంటే ఆ ఇంటిని తను కొనుగోలు చేయడమే మార్గం అని హీరోకి అర్థం కావడంతో సినిమా ముగుస్తుంది!
మామూలుగా చూస్తే ఇదొక డార్క్ కామెడీ, మనసుతో చూస్తే.. మాత్రం కొన్ని రోజుల పాటు ఈ సినిమా వెంటాడుతుంది.
-జీవన్ రెడ్డి.బి