జనసేన నేత, సినీ నటుడు, నిర్మాత నాగబాబుకి ఎట్టకేలకు జ్ఞానోదయం అయ్యింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎడా పెడా విమర్శలు చేసేసిన నాగబాబు, చివరికి చల్లబడ్డారు. ‘హుందాతనాన్ని’ ఎరువు తెచ్చుకున్నట్లుగా, ‘కుటిల రాజకీయ నాయకుల చెత్త విమర్శలపై నేను రెస్పాండ్ అవదలచుకోలేదు’ అంటూ సెలవిచ్చారు. అంతలోనే, ‘జనసేన కార్యకర్తగా, ఒక బ్రదర్‌గా నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది..’ అంటూ తనను తాను సమర్థించేసుకున్నారు కూడా.
ట్విట్టర్ వేదికగా జనసేన తీరుని విజయసాయిరెడ్డి ఎండగట్టేయడంతో, నాగబాబు పరుష పదజాలాన్ని ప్రదర్శించేశారు సోషల్ మీడియా వేదికగా. కొందరు సినీ అభిమానులు నాగబాబు వ్యాఖ్యలపై పండగ చేసుకున్నా, నాగబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెను దుమారమే రేపింది. ‘గుంట నక్కలు’, ‘ఎదవ రాజకీయాలు..’ అంటూ నాగబాబు తిట్ల దండకం ఆయన స్థాయినే తగ్గించేసింది.
కోరుకున్న స్థాయిలో పార్టీ శ్రేణుల నుంచి ‘స్పందన’ రాలేదనుకున్నారో ఏమోగానీ, సాయంత్రానికి.. ‘సన్నాయి నొక్కుడు’ ట్వీట్లతో సరిపెట్టారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై చాలా చాలా విమర్శలు చాలా చాలా సార్లు వచ్చి పడ్డాయి. అప్పుడెప్పుడూ ‘తమ్ముడి మీద ప్రేమ’ అన్నయ్య నాగబాబుకి వచ్చేయలేదాయె.
అంతెందుకు, మెగా అభిమానుల్లోనే కొందరు పవన్ కళ్యాణ్‌ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తే, పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒళ్ళు మండితే, ‘ఏం చేయమంటారు.. మేం పిలిస్తే వాడు రావడంలేదు.. మీరు పిలవండి..’ అంటూ అసహనం వ్యక్తం చేసిన నాగబాబు.. ఇప్పుడు తమ్ముడి తరఫున వకాల్తా పుచ్చుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోవడాన్నీ చాలామంది ఎద్దేవా చేస్తున్నారు మరి.!