Advertisement

Advertisement


Home > Movies - Movie News

శరత్ బాబు కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుంది?

శరత్ బాబు కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుంది?

సీనియర్ నటుడు శరత్ బాబు కొన్ని రోజుల కిందట తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కెరీర్ లో 220కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. ఎంతో పేరుప్రతిష్టలతో పాటు, మరెంతో ఆస్తులు కూడా కూడబెట్టారు. ఆయనకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో భారీగా ఆస్తులున్నాయి. ఇప్పుడా ఆస్తులు ఎవరికి దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది.

శరత్ బాబుకు వారసులు లేరు. ఆయన రమాప్రభను పెళ్లాడారు. కానీ వాళ్లిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత స్నేహలత అనే ఆమెను వివాహమాడారు. ఆ వివాహ బంధం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. విబేధాలొచ్చి ఆమెతో కూడా విడిపోయారు. అప్పట్నుంచి సింగిల్ గానే ఉంటున్న శరత్ బాబు, మూడో వివాహం చేసుకున్నారనే పుకార్లు ఉన్నప్పటికీ, వాటిలో నిజం లేదని, తాజాగా ఆయన కుటుంబీకులు స్పష్టం చేశారు.

శరత్ బాబుకు పిల్లలు లేకపోవడంతో.. అతడి కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుందనేది పాయింట్. సరిగ్గా ఇక్కడే వాళ్ల కుటుంబ నేపథ్యం ఆసక్తి రేకెత్తిస్తోంది. శరత్ బాబుకు 8 మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు. శరత్ బాబు మూడో వాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పటికీ వీళ్లంతా కలిసే ఉంటున్నారు.

అంతేకాదు.. తన చెల్లెళ్ల పెళ్లిళ్లతో పాటు, వారి పిల్లల పెళ్లిళ్లు కూడా శరత్ బాబు చేశారంట. కుటుంబంలో ఎంతోమందిని చదివించారట. అలా అన్నదమ్ములు, అక్కచెల్లెల పిల్లలందర్నీ తన పిల్లలుగా చూసుకున్నారు శరత్ బాబు.

జీవిత చరమాంకంలో శరత్ బాబుకు అండగా నిలిచింది ఈ కుటుంబ సభ్యులే. అనారోగ్య కారణాలతో 2 నెలల పాటు హాస్పిటల్ కే పరిమితమైన శరత్ బాబును.. అక్కాచెల్లెళ్లు కంటికి రెప్పలా చూసుకున్నారు. శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చింది కూడా వాళ్లే.

సో.. ఇంతమంది కుటుంబ సభ్యుల్లో శరత్ బాబు తన ఆస్తిని ఎవరికి రాసిచ్చారనేది ప్రశ్న. దీనికి ఆయన తమ్ముడు మధు సమాధానం చెప్పారు. శరత్ బాబు ఆస్తుల గురించి మాట్లాడుకునే టైమ్ ఇది కాదన్నారు. ఆయన దశదిన కర్మ పూర్తయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తామన్నారు. శరత్ బాబు వీలునామా రాసి ఉంటే, దాని ప్రకారం ఆస్తి పంపకాలు జరుగుతాయని.. ఒకవేళ వీలునామా లేకపోతే అప్పుడు అంతా కూర్చొని చర్చించుకుంటామని మధు తెలిపారు. తామంతా ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటున్నామని, ఆస్తి కోసం కొట్టుకునే పరిస్థితి రాదని కూడా స్పష్టం చేశారు.

తాజా సమాచారం ప్రకారం.. శరత్ బాబు, తన వీలునామా రాసి ఉంచారని తెలుస్తోంది. ఆ వీలునామాతో అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలకు ఆయన తప్పకుండా ఆస్తిలో వాటా ఇచ్చే ఉంటారు. అయితే తన ఇద్దరు మాజీ భార్యలకు ఆయన ఏమైనా కేటాయింపులు చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మధు చెప్పినట్టు దశదిన కర్మ తర్వాత, శరత్ బాబు ఆస్తి పంపకాలపై ఓ క్లారిటీ వస్తుంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా